ముంబై, జూలై 18: దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండోరోజు భారీగా లాభపడ్డాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల అంశాలతో ఐటీ, చమురు అండ్ గ్యాస్, బ్యాంకింగ్ షేర్లకు మదుపరుల నుంచి లభించిన మద్దతుతో సెన్సెక్స్ మళ్లీ 54 వేల పాయింట్ల మార్క్ దాటింది. మార్కెట్ ముగిసే సమయానికి 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ 760.37 పాయింట్లు లేదా 1.41 శాతం లాభపడి 54,521.15 వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 229.30 పాయింట్లు లేదా 1.43 శాతం అందుకొని 16,278.50 వద్ద నిలిచింది. ఆసియన్ మార్కెట్ల లాభాల్లో ట్రేడవడంతో దేశీయ సూచీలు కదంతొక్కాయి.
4.73 లక్షల కోట్లు పెరిగిన సంపద
స్టాక్ మార్కెట్లు భారీగా లాభపడటంతో మదుపరులు లాభాల జడివానలో తడిసి ముద్దవుతున్నారు. వరుస రెండు ట్రేడింగ్ సెషన్లలో మదుపరుల సంపద ఏకంగా రూ.4 లక్షల కోట్లకు పైగా పెరిగింది. దీంతో బీఎస్ఈలో లిైస్టెన సంస్థల మార్కెట్ విలువ రూ.4,73,814.10 కోట్లు పెరిగి రూ.2,55,39, 794.75 కోట్లకు చేరుకున్నది.
సెబీ ఫీజుపై 18% జీఎస్టీ
సెక్యూరిటీ మార్కెట్లలో లావాదేవీలు నిర్వహించే స్టాక్ ఎక్సేంజీలు, వ్యక్తులు తదితర మార్కెట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇనిస్టిట్యూషన్లు సెబీ ఫీజుపై సోమవారం నుంచి 18 శాతం వస్తు, సేవల పన్ను (జీఎస్టీ)ను చెల్లించాల్సి వస్తున్నది. ఈ మేరకు మార్కెట్ రెగ్యులేటర్ సెబీ ఓ సర్క్యులర్ విడుదల చేసింది. గత నెల జీఎస్టీ మండలి సిఫార్సుల నేపథ్యంలోనే ఈ భారం పడింది. ఇప్పటిదాకా సెబీ సేవలపై జీఎస్టీ మినహాయింపు ఉండేది. కానీ ఇటీవలి సమావేశంలో దాన్ని మండలి ఎత్తేసింది. దీంతో 18 శాతం జీఎస్టీ వర్తిస్తున్నది.