ముంబై, డిసెంబర్ 21: దేశీయ స్టాక్ మార్కెట్లు తిరిగి కోలుకున్నాయి. బ్లూచిప్ సంస్థల షేర్లకు మదుపరుల నుంచి లభించిన మద్దతుతో గురువారం సూచీలు అరశాతానికి పైగా లాభపడ్డాయి. నష్టాల్లో ప్రారంభమైన సూచీలకు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల అంశాలు సూచీలకు దన్నుగా నిలిచాయి.
ప్రారంభంలో 600 పాయింట్ల వరకు నష్టపోయిన 30 షేర్ల ఇండెక్స్ సూచీకి సెన్సెక్స్ చివరి గంటలో మదుపరులు కొనుగోళ్లకు మద్దతు తెలిపారు. దీంతో సెన్సెక్స్ 358.79 పాయింట్లు అందుకొని 70,865.10 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో 70 వేల దిగువకు పడిపోయింది. 21,288 నుంచి 20,976 పాయింట్ల శ్రేణిలో కదలాడిన నిఫ్టీ చివరకు 104.90 పాయింట్లు పెరిగి 21,255.05 వద్ద స్థిరపడింది.