ముంబై, మార్చి 8: స్టాక్ మార్కెట్లో వరుసగా నాలుగు రోజుల్నుంచి చవిచూస్తున్న భారీ నష్టాలకు మంగళవారం బ్రేక్‌పడింది. రష్యా-ఉక్రయిన్ యుద్ధ సంక్షోభం కొనసాగుతున్నా, ఇటీవల తీవ్రంగా తగ్గిన ఐటీ, ఫార్మా షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో స్టాక్ సూచీలు కోలుకున్నాయి. బీఎస్ఈ సెన్సెక్స్ ట్రేడింగ్ తొలిదశలో బలహీనంగా ప్రారంభమైనా, మధ్యాహ్నం నుంచి నెమ్మదిగా పెరుగుతూ 581 పాయింట్ల లాభంతో 53,424 పాయింట్ల వద్ద ముగిసింది. ఇదేరీతిలో ఎన్ఎస్ఈ నిఫ్టీ 150 పాయింట్లు పెరిగి 16,013 పాయింట్ల వద్ద నిలిచింది. రూపాయి క్షీణించిన నేపథ్యంలో ఎగుమతి ఆధారిత రంగాలైన ఐటీ, ఫార్మా షేర్లలో ఇన్వెస్టర్లు కొనుగోళ్లు జరిపారని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ చెప్పారు. డాలరు మారకంలో రూపాయి విలువ రికార్డు కనిష్ఠస్థాయి 77 సమీపంలో నిలిచింది. ప్రపంచ మార్కెట్లో క్రూడ్ ధర మాత్రం 127 డాలర్ల గరిష్ఠస్థాయిలోనే ట్రేడవుతున్నది.
సన్‌ఫార్మా టాప్ గెయినర్
సెన్సెక్స్-30 షేర్లలో అన్నింటికంటే అధికంగా సన్‌ఫార్మా 4 శాతం ఎగిసింది. టీసీఎస్, ఎన్టీపీసీ, విప్రో, టెక్ మహీంద్రా, డాక్టర్ రెడ్డీస్, అల్ట్రాటెక్ సిమెంట్, ఇన్ఫోసిస్‌లు 2-3 శాతం మధ్య పెరిగాయి. మరోవైపు టాటా స్టీల్, పవర్‌గ్రిడ్, టైటాన్, నెస్లే ఇండియా, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఎస్బీఐ షేర్లు 1.7 శాతం వరకూ నష్టపోయాయి. బీఎస్ఈ మిడ్‌క్యాప్, స్మాల్ క్యాప్ ఇండెక్స్‌లు 1.4 శాతం మేర పెరిగాయి. రంగాలవారీగా చూస్తే బీఎస్ఈ ఐటీ, టెక్నాలజీ, హెల్త్‌కేర్, రియల్టీ ఇండెక్స్‌లు 3.19 శాతం లాభపడ్డాయి.
రూ.2.51 లక్షల కోట్లు పెరిగిన సంపద
తాజా మార్కెట్ రికవరీతో ఇన్వెస్టర్ల సంపద రూ.2.51 లక్షల కోట్ల మేర పెరిగింది. బీఎస్ఈలో లిస్టయిన మొత్తం కంపెనీల మార్కెట్ విలువ రూ.2,51,664 కోట్లు అధికమై రూ.2,43,62,495 కోట్లకు చేరింది.