Stock Market | ముంబై, మే 13: దేశీయ స్టాక్ మార్కెట్ల వరుస నష్టాలకు బ్రేక్‌పడింది. ప్రారంభంలో కుప్పకూలిన సూచీలకు చివరి గంటలో మదుపరులు ఎగబడి కొనుగోళ్లు జరపడంతో సూచీలు తిరిగి లాభాల్లోకి వచ్చాయి. బ్లూచిప్ సంస్థలైన హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, టీసీఎస్‌ల షేర్లకు మదుపరుల నుంచి లభించిన మద్దతు వల్లనే లాభాల్లోకి రాగలిగాయి.
ఇంట్రాడేలో 800 పాయింట్లు నష్టపోయిన 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ చివరకు 111.66 పాయింట్లు లాభపడి 72,776.13 వద్ద ముగిశాయి. అలాగే ఒకానొక సమయంలో 310 పాయింట్లు నష్టపోయిన ఎన్ఎస్ఈ నిఫ్టీ మార్కెట్ ముగిసే సమయానికి 48.85 పాయింట్లు అందుకొని 22,104.05 వద్ద ముగిశాయి.
అక్కడక్కడే రూపాయి
డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ సోమవారం యథాతథంగానే ఉన్నది. ఫారెక్స్ మార్కెట్లో భారతీయ కరెన్సీ 83.51 వద్దే ముగిసింది. ఒకానొక దశలో స్వల్పంగా పెరిగి 83.53 స్థాయికి చేరినా.. చివరకు శుక్రవారం ముగింపు స్థాయి 83.51 దగ్గరకే వచ్చి ఆగింది. ఇదిలావుంటే విదేశీ సంస్థాగత మదుపరులు (ఎఫ్ఐఐలు) దేశీయ మార్కెట్ల నుంచి తమ పెట్టుబడులను మున్ముందూ వెనక్కి తీసుకుంటే.. రూపాయి విలువపై మరింత ప్రతికూల ప్రభావం తప్పదని మార్కెట్ ట్రేడర్లు విశ్లేషిస్తున్నారు. అయితే బాండ్ ఆధారిత డాలర్ల ప్రవాహం ఉంటే మాత్రం రూపాయి బలపడగలదని అభిప్రాయపడుతున్నారు.