ముంబై, నవంబర్ 25: దేశీయ స్టాక్ మార్కెట్లు రివ్వున ఎగిశాయి. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని మహాయుతి సంకీర్ణ ప్రభుత్వం బంపర్మెజార్టీతో విజయసాధించడంతో సూచీలు కదంతొక్కాయి. వీటికితోడు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల అంశాలు సూచీల్లో మరింత జోష్ పెంచింది. లాభాల్లో ప్రారంభమైన సూచీలు ఒకదశలో రెండు శాతం వరకు లాభపడ్డాయి. క్యాపిటల్ గూడ్స్, ఎనర్జీ, బ్యాంకింగ్ రంగ షేర్లు మదుపరులను కొనుగోళ్లవైపు నడిపించాయి.
ఫలితంగా ఇంట్రాడేలో 1,400 పాయింట్ల వరకు లాభపడిన 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ 80 వేల పాయింట్ల మైలురాయిని మరోసారి అధిగమించింది. చివరకు 992.74 పాయింట్లు లేదా 1.25 శాతం లాభపడి 80,109.85 వద్ద నిలిచింది. 2,697 షేర్లు లాభపడగా, 1,352 సూచీలు పతనం చెందాయి. మరో సూచీ నిఫ్టీ 314.65 పాయింట్లు లేదా 1.32 శాతం ఎగబాకి 24,221.90 వద్ద స్థిరపడింది.
అదానీ గ్రూపునకు చెందిన షేర్లు మిశ్రమంగా ట్రేడయ్యాయి. ఫ్రెంచ్నకు చెందిన టోటల్ఎనర్జీ..అదానీ గ్రూపులో పెట్టుబడులను నిలిపివేస్తున్నట్లు ప్రకటించడంతో అదానీ గ్రీన్ ఎనర్జీ షేరు ఏకంగా 8 శాతం నష్టపోయింది. దీంతోపాటు అదానీ ఎనర్జీ సొల్యుషన్స్ 3.78 శాతం నష్టపోగా, అదానీ పవర్ 3.02 శాతం, ఎన్డీటీవీ 2.07 శాతం, అదానీ టోటల్ గ్యాస్ 1.43 శాతం చొప్పున నష్టపోయాయి. కానీ, అదానీ పోర్ట్స్ 2.55 శాతం అధికమవగా, ఏసీసీ 2.54 శాతం, అదానీ ఎంటర్ప్రైజెస్ 1.26 శాతం, అదానీ విల్మార్ 1.81 శాతం, అంబుజా సిమెంట్ స్వల్పంగా లాభపడింది.
స్టాక్ మార్కెట్ల భారీ లాభాలతో మదుపరులు తడిసిముద్దవుతున్నారు. గత కొన్నాళ్లుగా నష్టాలే పరమావధిగా గడిచిన సూచీలు రికార్డు స్థాయిలో లాభపడటంతో మదుపరులు సంపద లక్షల కోట్ల స్థాయిలో పెరిగింగి. గత వరుస రెండు సెషన్లలో మదుపరుల సంపద రూ.14.20 లక్షల కోట్ల మేర పెరిగింది. దీంతో బీఎస్ఈలో లిైస్టెన సంస్థల మార్కెట్ విలువ రూ.14,20,004.4 కోట్లు పెరిగి రూ.4,39,58,912.41 కోట్లు(5.22 ట్రిలియన్ డాలర్లు) చేరుకున్నది.