Stocks | అంతర్జాతీయ మార్కెట్ల్లో సానుకూల పరిస్థితులు, క్రూడాయిల్ ధరల తగ్గుముఖంతో దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజు గురువారం లాభాలతో ముగిశాయి. బీఎస్ఈ-30 ఇండెక్స్ సెన్సెక్స్ దాదాపు 610 పాయింట్లు పుంజుకుని 74,000 పాయింట్ల మార్క్‌ను దాటింది. మరోవైపు, ఎన్ఎస్ఈ-50 సూచీ నిఫ్టీ 22,500 పాయింట్ల ఎగువన స్థిర పడింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ వంటి బ్లూ చిప్ కంపెనీల స్టాక్స్‌కు భారీ కొనుగోళ్ల మద్దతు లభించింది. ఫలితంగా గురువారం ప్రారంభ నష్టాల నుంచి రికవరీ సాధిస్తూ బీఎస్ఈ-30 సెన్సెక్స్ 609.86 పాయింట్లు (0.83 శాతం) లబ్ధితో 74,340.09 పాయింట్ల వద్ద ముగిసింది. అంతర్గత ట్రేడింగ్‌లో బీఎస్ఈ సెన్సెక్స్ 660.57 పాయింట్లు (0.89 శాతం) వృద్ధి చెంది 74,390.80 పాయింట్ల గరిష్టాన్ని తాకింది. మరోవైపు ఎన్ఎస్ఈ-50 సూచీ నిఫ్టీ 207.40 పాయింట్ల వృద్ధి (0.93శాతం)తో 22,544.70 పాయింట్ల వద్ద స్థిర పడింది. ఇంట్రాడే ట్రేడింగ్‌లో నిఫ్టీ 219.15 పాయింట్ల (0.98శాతం)తో 22,556.45 పాయింట్ల గరిష్టానికి చేరుకుంది.
బీఎస్ఈ సెన్సెక్స్‌లో ఏషియన్ పెయింట్స్, ఎన్టీపీసీ, రిలయన్స్ ఇండస్ట్రీస్, టాటా స్టీల్, బజాజ్ ఫిన్ సర్వ్, హిందూస్థాన్ యూనీ లివర్ (హెచ్‌యూఎల్), సన్ ఫార్మా, అదానీ పోర్ట్స్ అండ్ సెజ్, యాక్సిస్ బ్యాంక్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్), టైటాన్, బజాజ్ ఫైనాన్స్ తదితర స్టాక్స్ లాభ పడ్డాయి. మరోవైపు, టెక్ మహీంద్రా, కోటక్ మహీంద్రా బ్యాంక్, జొమాటో, టాటా మోటార్స్, ఇండస్ఇండ్ బ్యాంక్ తదితర స్టాక్స్ నష్టాలతో ముగిశాయి. క్రూడాయిల్ ధరల్లో సర్దుబాటు, చైనా ఉద్దీపన పథకాలతో ఆశావాద దృక్పథం నెలకొనడంతో ఎనర్జీ, మెటల్ సెక్టార్లు పుంజుకున్నాయి.
బీఎస్ఈ స్మాల్ క్యాప్ 1.63 శాతం, మిడ్ క్యాప్ 0.65 శాతం పుంజుకున్నాయి. ఎనర్జీ, మెటల్, ఆయిల్ అండ్ గ్యాస్, కమొడిటీస్, యుటిలిటీస్, సర్వీసెస్, పవర్, హెల్త్ కేర్, ఎఫ్ఎంసీజీ, ఇండస్ట్రీయల్ సెక్టార్లు లాభాలతో ముగిశాయి. టెలి కమ్యూనికేషన్స్, రియాల్టీ సెక్టార్లు నష్టాలతో స్థిర పడ్డాయి. బీఎస్ఈలో 3,007 స్టాక్స్ లాభ పడగా, 989 స్టాక్స్ నష్టపోయాయి. మరో 107 స్టాక్స్ యధాతథంగా కొనసాగాయి.
ఆసియా మార్కెట్లలో టోక్యో, షాంఘై, హాంకాంగ్, సియోల్ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. యూరోపియన్ మార్కెట్లలో మిశ్రమ ధొరణి నెలకొంది. బుధవారం వాల్ స్ట్రీట్ మార్కెట్ పాజిటివ్‌గా ముగిసింది. గ్లోబల్ ఆయిల్ బెంచ్‌మార్క్ బ్రెంట్ క్రూడాయిల్ బ్యారెల్ ధర 0.52 శాతం పెరిగి 69.66 డాలర్లు పలికింది. బుధవారం వరకూ దేశీయ స్టాక్ మార్కెట్ల నుంచి విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు (ఎఫ్ఐఐ) రూ. 2,895.04 కోట్ల విలువైన పెట్టుబడులు ఉపసంహరించారు.