Stock Market | ముంబై, డిసెంబర్ 19: దేశీయ స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. అమెరికా ఫెడరల్ రిజర్వు వడ్డీరేట్లను పావు శాతం మేర తగ్గిస్తూ తీసుకున్న నిర్ణయంతోపాటు వచ్చే ఏడాది రేట్లను ఆశించిన స్థాయిలో కోత ఉండకపోవచ్చన్న సంకేతాలు ఇవ్వడం మదుపరుల్లో సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. ఫలితంగా నష్టాల బటన్ నొక్కిన మదుపరులు చివరి వరకు ఇదే పంతాను కొనసాగించడంతో రోజంతా నష్టాల్లో ట్రేడయ్యాయి.
కన్జ్యూమర్ డ్యూరబుల్, బ్యాంకింగ్, ఐటీ రంగ షేర్లు భారీ నష్టాల్లో కూరుకుపోవడంతోపాటు విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు భారీగా నిధులను తరలించుకుపోవడంతో సెన్సెక్స్ 80 వేల కీలక మైలురాయిని కోల్పోయింది. ఇంట్రాడేలో 1,100 పాయింట్లకు పైగా నష్టపోయిన 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ చివరకు 964.15 పాయింట్లు లేదా 1.20 శాతం నష్టపోయి 79,218.05 వద్ద నిలిచింది. మరో సూచీ నిఫ్టీ 247.15 పాయింట్లు లేదా 1.02 శాతం నష్టపోయి 24 వేల పాయింట్ల దిగువకు 23,951.70 వద్దకు జారుకున్నది. గత నాలుగు రోజుల్లో సెన్సెక్స్ 2,915.07 పాయింట్లు లేదా 3.54 శాతం, నిఫ్టీ 816.60 పాయింట్లు లేదా 3.29 శాతం నష్టపోయింది.
స్టాక్ మార్కెట్ల వరుస నష్టాలతో లక్షల కోట్ల మదుపరుల సంపద హారతి కర్పూరంలా కరిగిపోయింది. గత నాలుగు రోజులుగా సూచీలు నష్టాల్లో ట్రేడవడంతో మదుపరులు రూ.10 లక్షల కోట్ల వరకు సంపదను కోల్పోయారు. దీంతో బీఎస్ఈలో లిైస్టెన సంస్థల మార్కెట్ విలువ రూ.9,65,935.96 కోట్లు కరిగిపోయి రూ.4,49,76,402.63 కోట్లు (5.29 ట్రిలియన్ డాలర్లు)కు పడిపోయింది.