Stocks | స్టాక్ మార్కెట్ మదుపర్లను ఇవాళ కోలుకోలేని దెబ్బతీసింది. గత కొద్ది రోజులుగా డౌన్ ట్రెండ్‌లో నడుస్తున్న మార్కెట్ ఇవాళ పాతాళలోకానికి పడిపోయింది. ఒక్కరోజే సుమారు రూ. 10 లక్షల కోట్ల రూపాయలు ఆవిరయ్యాయి.తాజాగా ప్రపంచ దేశాల నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై టారిఫ్‌లు పెంచుతామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటనతో వాణిజ్య యుద్ధానికి తెర తీశారు. మరోవైపు, దేశీయ వృద్ధిరేటు పురోగతిపై సందేహాల మధ్య విదేశీ ఇన్వెస్టర్లు దేశీయ స్టాక్ మార్కెట్ల నుంచి నిరంతరం నిధుల ఉపసంహరణకు పాల్పడటంతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ బలహీన పడింది. ఫలితంగా మంగళవారం ఈక్విటీ మార్కెట్లు వరుసగా ఐదో రోజు ఒకశాతానికి పైగా నష్టాలతో ముగిశాయి.
బీఎస్ఈ-30 ఇండెక్స్ సెన్సెక్స్ 1,018.20 పాయింట్లు (1.32శాతం) నష్టపోయి రెండు వారాల కనిష్ట స్థాయి 76,293.60 పాయింట్ల వద్ద స్థిర పడింది. ఇంట్రాడే ట్రేడింగ్‌లో 1281.21 పాయింట్ల (1.65 శాతం) పతనంతో 76,030.59 పాయింట్ల కనిష్టానికి పడిపోయింది. మరోవైపు ఎన్ఎస్ఈ-50 సూచీ నిఫ్టీ సైతం 309.80 పాయింట్ల (1.32 శాతం) పతనంతో 23,071.80 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీలోని 50 స్టాక్స్‌లో 44స్టాక్స్ నష్టాలతో స్థిర పడితే, ఆరు స్లాక్స్ లాభ పడ్డాయి.
బీఎస్ఈ-30 ఇండెక్స్ సెన్సెక్స్‌లో జొమాటో ఐదు శాతానికి పైగా నష్టపోయింది. టాటా స్టీల్, బజాజ్ ఫిన్ సర్వ్, టాటా మోటార్స్, పవర్ గ్రిడ్, లార్సెన్ అండ్ టర్బో, కోటక్ మహీంద్రా బ్యాంక్, హిందూస్థాన్ యూనీ లివర్ (హెచ్‌యూఎల్), ఐటీసీ నష్టాలతో ముగిస్తే, భారతీ ఎయిర్టెల్ మాత్రమే లాభ పడింది. గత ఐదు రోజుల్లో బీఎస్ఈ సెన్సెక్స్ 2290.21 పాయింట్లు (2.91 శాతం) పతనమైంది. నిఫ్టీ 667.45 పాయింట్లు (2.81 శాతం) నష్టపోయింది. సోమవారం నాటికి దేశీయ స్టాక్ మార్కెట్ల నుంచి విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.2463.72 కోట్ల విలువైన వాటాలను ఉపసంహరించారు.