న్యూఢిల్లీ, డిసెంబర్ 23: గత రెండు దశాబ్దాలుగా డిసెంబర్ నెలలో జరుగుతున్న శాంతాక్లాజ్ ర్యాలీకి ఈ 2022లో బ్రేక్పడినట్లే కన్పిస్తున్నది. కేవలం నాలుగు రోజుల్లో బీఎస్ఈ సెన్సెక్స్ 2,000 పాయింట్లు పతనమయ్యింది. వివిధ కారణాలతో శుక్రవారం ఒక్కరోజునే సెన్సెక్స్ 981 పాయింట్లు కోల్పోయి 59,845 పాయింట్ల వద్ద ముగిసింది. డిసెంబర్ నెలలో చివరి 5 ట్రేడింగ్ రోజులు, జనవరి నెలలో తొలి రెండు ట్రేడింగ్ రోజుల్లో మార్కెట్ లాభపడితే దానిని శాంతా ర్యాలీగా పిలుస్తుంటారు. తాజాగా ఏర్పడిన బేరిష్ సెంటిమెంట్ కారణంగా అది జరిగే అవకాశం తక్కువగా ఉన్నదని మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రపంచ సూచీల్లోకెల్లా ఈ ఏడాది అత్యుత్తమ ప్రదర్శన చేసిన ఎన్ఎస్ఈ నిఫ్టీ తాజాగా కీలకమైన 18,000 పాయింట్ల స్థాయిని కోల్పోయింది. చైనాలో కొవిడ్ కేసులు భారీగా పెరగడం, మరికొన్ని దేశాలు పాండమిక్ భయాల్ని వ్యక్త చేయడంతో మార్కెట్లో అమ్మకాలు వెల్లువెత్తాయని కొటక్ సెక్యూరిటీస్ వైస్ ప్రెసిడెంట్ అమోల్ అథేవాలా చెప్పారు. అలాగే అమెరికా జీడీపీ మార్కెట్ అంచనాలకంటే అధికంగా 3.2 శాతం వృద్ధిచెందిందన్న వార్తతో ఆ దేశపు కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను మరింతగా పెంచుతుందన్న భయాలు సైతం ఇన్వెస్టర్లలో తలెత్తాయన్నారు. ఈ ఏడాది అక్టోబర్ 28 తర్వాత సెన్సెక్స్ 60,000 దిగువన ముగియడం ఇదే ప్రధమం. మరోవైపు నిఫ్టీ 320 పాయింట్లు నష్టపోయి 18,000 దిగువన 17,807 వద్ద ముగిసింది.
తాజా మార్కెట్ పతనంలో బ్యాంకింగ్, మెటల్, రియల్టీ షేర్లు భారీగా నష్టపోయాయి. సెన్సెక్స్-30 షేర్లలో అన్నింటికంటే అధికంగా టాటా స్టీల్ 5 శాతంపైగా క్షీణించింది. టాటా మోటార్స్, బజాజ్ ఫిన్సర్వ్, ఎస్బీఐ, రిలయన్స్ ఇండస్ట్రీస్, విప్రో, ఇండస్ఇండ్ బ్యాంక్, మారుతి సుజుకి, ఎల్ అండ్ టీలు 3-5 శాతం మధ్య తగ్గాయి.
కొద్ది రోజులుగా విదేశీ ఇన్వెస్టర్లు మార్కెట్ నుంచి నిధులు వెనక్కు తీసుకుంటున్న కారణంగా రూపాయి మారకపు విలువ శుక్రవారం మరో మూడు పైసలు క్షీణించి 82.82 వద్ద ముగిసింది.
ఈ వారంలో వరుసగా నాలుగు రోజుల క్షీణతతో ఇన్వెస్టర్లు రూ.15.48 లక్షల కోట్ల సంపదను కోల్పోయారు. శుక్రవారం ఒక్కరోజునే రూ.8 లక్షల కోట్ల సంపద ఆవిరైపోయింది. దీంతో బీఎస్ఈలో లిస్టయిన మొత్తం కంపెనీల మార్కెట్ విలువ రూ.2,72,12,860 కోట్లకు పడిపోయింది.