Stocks | విదేశీ ఇన్వెస్టర్ల నిధుల ఉపసంహరణ, బ్యాంకింగ్‌తోపాటు సెలెక్టెడ్ ఐటీ షేర్లపై అమ్మకాల ఒత్తిడి పెరగడంతో దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా ఏడో సెషన్లో నష్టాలతో ముగిశాయి. గురువారం ప్రారంభంలో బీఎస్ఈ-30 ఇండెక్స్ సెన్సెక్స్, ఎన్ఎస్ఈ-50 సూచీ నిఫ్టీ లాభాలతో పుంజుకున్నా చివరకు స్వల్ఫ నష్టాలతో ఫ్లాట్‌గా ముగిశాయి.
బీఎస్ఈ-30 ఇండెక్స్ సెన్సెక్స్ ట్రేడింగ్ ముగిసే సమయానికి 32.11 పాయింట్ల నష్టంతో 76,138.97 పాయింట్ల వద్ద ముగిసింది. ట్రేడింగ్ పాజిటివ్‌గానే ప్రారంభమైంది. అంతర్గత ట్రేడింగ్‌లో సెన్సెక్స్ 751.1 పాయింట్ల లబ్ధితో 76,764.53 పాయింట్ల గరిష్టానికి దూసుకెళ్లి తిరిగి 76,013.43 పాయింట్ల కనిష్ట స్థాయికి పతనమైంది. మరోవైపు ఎన్ఎస్ఈ-50 సూచీ నిఫ్టీ 13.85 పాయింట్లు పతనమై 23,031.40 పాయింట్ల వద్ద స్థిర పడింది.
బీఎస్ఈ-30 ఇండెక్స్ సెన్సెక్స్‌లో బ్లూ చిప్ కంపెనీలు అదానీ పోర్ట్స్, ఇన్ఫోసిస్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్), భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ), నెస్లే, టైటాన్ తదితర స్టాక్స్ నష్టపోయాయి. మరోవైపు సన్ ఫార్మా, టాటా స్టీల్, బజాజ్ ఫిన్ సర్వ్, కోటక్ మహీంద్రా బ్యాంక్, జొమాటో భారీగా లబ్ధి పొందాయి. దేశీయ స్టాక్ మార్కెట్ల నుంచి విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు (ఎఫ్ఐఐ) రూ.4,969.30 కోట్ల విలువైన వాటాలను ఉపసంహరించారు.
ద్రవోల్బణం గణాంకాలతో ప్రారంభంలో లాభాలతో మొదలైన స్టాక్ మార్కెట్లు.. అంతర్జాతీయ బలహీనతలతోపాటు కార్పొరేట్ తృతీయ త్రైమాసిక ఫలితాలు అంతంత మాత్రంగా ఉండటం.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌పై ఆసక్తితో పుంజుకున్న చైనా టెక్నాలజీ షేర్లతో విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు ఆకర్షణీయ లాభాలపై దృష్టి సారించారు. ఇక నరేంద్రమోదీ-డొనాల్డ్ ట్రంప్ మధ్య ద్వైపాక్షిక చర్చల సారాంశంపై ఇన్వెస్టర్లు దృష్టి సారించారని జియోజిత్ ఫైనాన్సియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ తెలిపారు. గత నెలలో రిటైల్ ద్రవ్యోల్బణం ఐదు నెలల కనిష్ట స్థాయి 4.31 శాతానికి పడిపోయింది. కూరగాయలు, కోడిగుడ్లు, పప్పుల ధరలు తగ్గుముఖం పట్టడంతో గత నెలలో రిటైల్ ద్రవ్యోల్బణం దిగి వచ్చింది.
ఆసియన్ మార్కెట్లలో సియోల్, టోక్యో షేర్లు పాజిటివ్‌గా ముగిస్తే, షాంఘై, హాంకాంగ్ నష్టాలతో స్థిర పడ్డాయి. యూరోపియన్ యూనియన్ మార్కెట్లలో మిశ్రమ ధోరణి నెలకొంది. బుధవారం యూఎస్ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. గ్లోబల్ ఆయిల్ బెంచ్ మార్క్ బ్రెంట్ క్రూడాయిల్ బ్యారెల్ ధర 0.94 శాతం తగ్గి 74.47 డాలర్ల వద్ద ట్రేడవుతున్నది.