Stocks | అమెరికా తాజా టారిఫ్ హెచ్చరికలతో ఇన్వెస్టర్లలో విశ్వాసం సన్నగిల్లింది. ఫలితంగా దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం వరుసగా నాలుగో సెషన్లో నష్టాలతో ముగిశాయి. బ్లూ చిప్ స్టాక్స్ బ్యాంకింగ్, మెటల్, ఆయిల్ షేర్లు అమ్మకాల ఒత్తిడికి గురయ్యాయి.
బీఎస్ఈ-30 ఇండెక్స్ సెన్సెక్స్ 548.39 పాయింట్లు (0.70 శాతం) పతనమై 77,311.80 పాయింట్లతో సరిపెట్టుకున్నది. ఇది వారం క్రితం కనిష్టంతో సమానం. ఇంట్రాడే ట్రేడింగ్‌లో సెన్సెక్స్ 753.3 పాయింట్లు (0.96 శాతం) నష్టంతో 77,106.89 పాయింట్ల కనిష్టానికి పడిపోయింది. మరోవైపు ఎన్ఎస్ఈ-50 సూచీ నిఫ్టీ 178.35 పాయింట్లు (0.76శాతం) నష్టంతో 23,381.60 పాయింట్ల వద్ద స్థిర పడింది. నిఫ్టీలో ట్రెంట్, టాటా స్టీల్, పవర్‌గ్రిడ్ నష్టపోయాయి.
జియోజిత్ ఫైనాన్సియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ స్పందిస్తూ ‘అమెరికా టారిఫ్ ముప్పు ఇన్వెస్టర్లు, మార్కెట్ల సెంటిమెంట్‌పై ప్రభావం చూపింది. దేశీయ బాండ్ల మార్కెట్ వృద్ధి చెందినా ఇన్వెస్టర్లు ఆచితూచీ స్పందిస్తున్నారు. రిస్క్ అసెట్స్‌లో పెట్టుబడులు పెట్టడం కంటే సురక్షిత పెట్టుబడి మార్గం బంగారంలో ఇన్వెస్ట్మెంట్లకు ప్రాధాన్యం ఇస్తున్నారు’ అని చెప్పారు.
బీఎస్ఈ-30 సెన్సెక్స్‌లో పవర్ గ్రిడ్, టాటా స్టీల్, జొమాటో, టైటాన్, బజాజ్ ఫైనాన్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, ఎన్టీపీసీ, టాటా మోటార్స్ భారీగా నష్టపోయాయి. మరోవైపు కోటక్ మహీంద్రా బ్యాంక్, భారతీ ఎయిర్టెల్, హెచ్‌సీఎల్ టెక్, టెక్ మహీంద్రా, ఐసీఐసీఐ బ్యాంక్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) లాభాలతో ముగిశాయి. ఈ నెల ఐదో తేదీ తర్వాత బీఎస్ఈ ఇండెక్స్ 1.63 శాతం, ఎన్ఎస్ఈ సూచీ నిఫ్టీ 1.51 శాతం పతనం కావడం ఇదే మొదటి సారి. అమెరికా దిగుమతి చేసుకునే స్టీల్, అల్యూమినియం ఉత్పత్తులపై సుంకాలు పెంచేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడంతో దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టపోయాయి.
ఆసియా మార్కెట్లలో టోక్యో, షాంఘై, హాంకాంగ్ లాభాలతో ముగిస్తే, సియోల్ నష్టపోయింది. శుక్రవారం యూఎస్ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. శుక్రవారం నాటికి దేశీయ ఈక్విటీ మార్కెట్ల నుంచి విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు (ఎఫ్ఐఐ) రూ.470.39 కోట్ల విలువైన పెట్టుబడులు ఉపసంహరించారు. గ్లోబల్ ఆయిల్ బెంచ్ మార్క్ బ్రెంట్ క్రూడాయిల్ బ్యారెల్‌పై 1.04 శాతం పెరిగి 75.44 డాలర్ల వద్ద ట్రేడవుతున్నది.