Stock Market | దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా ఎనిమిదో రోజు నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 76వేల పాయింట్లు.. నిఫ్టీ 23వేల పాయింట్లకు దిగువన ముగిసింది. విదేశీ పెట్టుబడుల ఉపసంహరణ నేపథ్యంలో మార్కెట్లు వరుస సెషన్లలో నష్టపోయాయి. దానికి తోడు భారత్ సహా పలు దేశాలపై రెసిప్రోకల్ టారిఫ్‌లను విధిస్తామని ట్రంప్ ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రధాని నరేంద్ర మోదీ అమెరికాలో పర్యటిస్తున్నారు. ఈ సమయంలోనూ టారిఫ్‌పై చేసిన వ్యాఖ్యలను సమర్థించుకున్నారు. అమెరికా ప్రెసిడెంట్ వ్యాఖ్యలు దేశీయ మార్కెట్లపై ప్రభావం చూపాయి. ఫలితంగా శుక్రవారం సైతం మార్కెట్లు నష్టాల్లో కూరుకుపోయాయి.
క్రితం సెషన్‌తో పోలిస్తే సెన్సెక్స్ 76,388.99 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. ఇంట్రాడేలో 76,483.06 పాయింట్ల గరిష్ఠానికి చేరిన సెన్సెక్స్.. అత్యల్పంగా 75,439.64 పాయింట్లకు చేరింది. చివరకు 199.76 పాయింట్ల నష్టంతో 75,939.21 వద్ద ముగిసింది. ట్రేడింగ్‌లో దాదాపు 642 షేర్లు లాభాలను నమోదు చేయగా.. 3,200 షేర్లు పతనమయ్యాయి. నిఫ్టీ ప్రస్తుతం ఆల్‌టైమ్ కంటే 13శాతం తగ్గింది. సెన్సెక్స్ గరిష్ఠ స్థాయి నుంచి 12శాతం పతనమైంది. సెన్సెక్స్, నిఫ్టీ 3శాతం పనమయ్యాయి. ట్రేడింగ్‌లో అన్ని రంగాలు సూచీలు నష్టాల్లోనే ముగిశాయి. బీఎస్ఈ మిడ్‌క్యాప్, బీఎస్ఈ స్మాల్ క్యాప్ సూచీలు దాదాపు 3శాతానికిపైగా పడిపోయాయి. స్మాల్‌క్యాప్ ఇండెక్స్ డిసెంబర్ రికార్డు గరిష్ఠ స్థాయి నుంచి దాదాపు 21 శాతం తగ్గింది. అయితే, మిడ్‌క్యాప్ సెప్టెంబర్ నాటి గరిష్ట ముగింపు స్థాయి కంటే 19.5 శాతం పడిపోయాయి.
అయితే, సుంకాల సడలింపు, యూఎస్ చమురు, గ్యాస్, యుద్ధ విమానాల కొనుగోలు చేయడంపై చర్చించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా అధ్యక్షుడి ప్రతిపాదించారు. ఈ క్రమంలో ట్రంప్ సుంకాల హెచ్చరికల నేపథ్యంలో మదుపరులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. ట్రంప్ యూఎస్ దిగుమతులపై పన్ను విధిస్తున్న ప్రతి దేశంపై ప్రతిగా సుంకాలు విధించేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నారు. దాంతో ప్రపంచ వాణిజ్య యుద్ధం జరగవచ్చనే భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. అయితే, సుంకాల విధింపు ఆలస్యమయ్యే అవకాశం ఉన్నా.. మార్కెట్లపై భారీగా ప్రభావం పడుతున్నది.