Stocks – Muhurat Trading | సంవత్ 2081 స్పెషల్ మూరత్ ట్రేడింగ్ లాభాలతో ముగిసింది. ప్రతియేటా దీపావళి మరుసటి రోజు మాదిరిగానే శుక్రవారం సాయంత్రం ఆరు గంటల నుంచి ఏడు గంటల వరకూ బీఎస్ఈ, ఎన్ఎస్ఈ మూరత్ ట్రేడింగ్ నిర్వహించాయి. ఈ ట్రేడింగ్ లో బీఎస్ఈ ఇండెక్స్ సెన్సెక్స్ 335.06 పాయింట్ల లబ్ధితో 79,724.12 పాయింట్ల వద్ద స్థిర పడింది. ఇంట్రా ట్రేడింగ్ లో బీఎస్ఈ సెన్సెక్స్ 80,023.75 పాయింట్ల నుంచి 79,655.55 పాయింట్ల మధ్య ట్రేడయింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 99 పాయింట్లు పుంజుకుని 24,304.35 పాయింట్ల వరకూ దూసుకెళ్లింది. నిఫ్టీ -50లోని 42 స్టాక్స్ లాభాలతో ముగిస్తే ఎనిమిది స్టాక్స్ నష్టాలతో సరి పెట్టుకున్నాయి.
బీఎస్ఈ సెన్సెక్స్‌లో మహీంద్రా అండ్ మహీంద్రా 3.29 శాతం, అదానీ పోర్ట్స్ 1.26 శాతం, టాటా మోటార్స్ 1.14 శాతం, యాక్సిస్ బ్యాంక్ 0.92 శాతం లాభ పడ్డాయి. ఇంకా నెస్లే, ఎన్టీపీసీ, రిలయన్స్, ఐటీసీ, టైటాన్, కొటక్ మహీంద్రా బ్యాంక్, ఇన్ఫోసిస్, టీసీఎస్ లాభాలతో ముగిశాయి. హెచ్ సీఎల్ టెక్, టెక్ మహీంద్రా, ఐసీఐసీఐ స్టాక్స్ నష్టాలతో ముగిశాయి. బీఎస్ఈ మిడ్ క్యాప్ 0.69 శాతం, స్మాల్ క్యాప్ 1.16 శాతం లబ్ధి పొందాయి. బీఎస్ఈలో ఆటో ఇండెక్స్ 1.15 శాతం, కన్జూమర్ డిస్క్రిషనరీ 1.10 శాతం, ఆయిల్ అండ్ గ్యాస్ 0.91 శాతం లాభ పడ్డాయి.
గురువారం ముగిసిన సంవత్ 2080లో బీఎస్ఈ సెన్సెక్స్ 14,484.38 పాయింట్లు, ఎన్ఎస్ఈ నిఫ్టీ 4,780 పాయింట్లు పుంజుకున్నాయి. ఏడాది కాలంలో బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల్లో ఇన్వెస్టర్ల సంపద రూ.124.42 లక్షల కోట్లు పెరిగి రూ.4,44,71,429.92 కోట్ల (5.29 లక్షల కోట్ల డాలర్లు) కు పెరిగింది. దేశీయ స్టాక్ మార్కెట్ల నుంచి విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు గురువారం రూ.5,813.30 కోట్ల విలువైన షేర్లు విక్రయించారు.