ముంబై, అక్టోబర్ 21: దేశీయ స్టాక్ మార్కెట్లో పటాకులు పేలలేవు. దీపావళి సందర్భంగా ప్రత్యేకంగా నిర్వహించిన మూరత్ ట్రేడింగ్‌లో సూచీలు అంతంత మాత్రంగానే లాభపడ్డాయి. నూతన సంవత్సరం సంవత్ 2082 తొలిరోజు మెరుపులు లేకుండా ముగిశాయి. కేవలం గంటపాటు సాగిన ట్రేడింగ్‌లో 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ 62.97 పాయింట్లు ఎగబాకి 84,426.34 వద్ద ముగియగా, నిఫ్టీ 25.45 పాయింట్లు అందుకొని 25,868.60 వద్ద ముగిసింది.
మధ్యాహ్నం 1.45 గంటలకు ప్రారంభమైన ప్రత్యేక మూరత్ ట్రేడింగ్ సెషన్ 2.45 గంటలకు ముగిసింది. దీపావళి సందర్భంగా ట్రేడర్లు, ఇన్వెస్టర్లు ఈరోజు నూతన అకౌంటింగ్ బుక్స్‌ను తెరుస్తారు. ఈ మూరత్ ట్రేడింగ్‌లో బజాజ్ ఫిన్సర్వ్ అత్యధికంగా 1.42 శాతం లాభపడగా, యాక్సిస్ బ్యాంక్, ఇన్ఫోసిస్, మహీంద్రా అండ్ మహీంద్రా, టాటా మోటర్స్, బజాజ్ ఫైనాన్స్, టాటా స్టీల్ షేరు లాభాల్లో ముగిశాయి.
కానీ, కొటక్ మహీంద్రా బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్‌సీఎల్ టెక్నాలజీ, భారతీ ఎయిర్టెల్, మారుతి సుజుకీ, ట్రెంట్, టీసీఎస్ షేర్లు తగ్గుముఖం పట్టాయి. బీఎస్ఈ మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ ఇండెక్స్‌లు ఒక్క శాతం వరకు లాభపడ్డాయి. రంగాలవారీగా ఇండస్ట్రియల్స్, టెలికాం, కమోడిటీస్, క్యాపిటల్ గూడ్స్, సర్వీసెస్, మెటల్ రంగ షేర్లు ఒక్క శాతం వరకు పెరుగగా..బ్యాంకింగ్, రియల్టీ రంగ షేర్లు నష్టపోయాయి. మరోవైపు, సంవత్ 2081లో సెన్సెక్స్ 4,974.31 పాయింట్లు లేదా 6.26 శాతం, నిఫ్టీ 1,637.80 పాయింట్లు లేదా 6.76 శాతం రిటర్నులు పంచింది.