Stock Market | ముంబై, అక్టోబర్ 7: వరుసగా ఆరో రోజూ కూడా దేశీయ స్టాక్ మార్కెట్లు భారీగా నష్టపోయాయి. బ్లూచిప్ సంస్థల షేర్లలో అమ్మకాలు పోటెత్తడం, అంతర్జాతీయ మార్కెట్లు మిశ్రమంగా ట్రేడవడం, విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు నిధులు తరలించుకుపోవడం సూచీల పతనానికి ఆజ్యంపోశాయి. ఒక దశలో వెయ్యి పాయింట్ల వరకు నష్టపోయిన 30 షేర్ల ఇండెక్స్ సూచీ ఇంట్రాడేలో 81 వేల పాయింట్ల దిగువకు పడిపోయింది. చివరకు 638.45 పాయింట్లు నష్టపోయి 81,050 వద్ద ముగిసింది.
మరోసూచీ నిఫ్టీ కూడా 218.85 పాయింట్లు కోల్పోయి 25 వేల కీలక మైలురాయిని కోల్పోయింది. చివరకు 24,795.75 వద్ద స్థిరపడింది. దీంతో మదుపరుల సంపద లక్షల కోట్ల స్థాయిలో కరిగిపోయింది. వరుసగా ఆరు సెషన్లలో సెన్సెక్స్ 4,521.85 పాయింట్లు లేదా 5.28 శాతం నష్టపోవడంతో మదుపరులు ఏకంగా రూ.9 లక్షల కోట్ల సంపదను కోల్పోయారు. దీంతో బీఎస్ఈలో లిైస్టెన కంపెనీ మార్కెట్ విలువ రూ.8,90,153.84 కోట్లు కరిగిపోయి రూ.4,51,99,444.70 కోట్ల(5.38 ట్రిలియన్ డాలర్లు) వద్దకు పడిపోయింది. అంతకుముందు రూ.4,60,89,598.54 కోట్లు (రూ.5.49 ట్రిలియన్ డాలర్లు) గా ఉన్నది.
బంగారం మరింత పైకి
బంగారం ధరలు మళ్లీ భగ్గుమంటున్నది. అంతర్జాతీయ మార్కెట్లకు తోడు ప్రస్తుత పండుగ సీజన్లో ఆభరణాల కొనుగోళ్లు ఊపందుకోవడంతో దేశీయంగా ధరలు రికార్డు స్థాయిలో దూసుకుపోతున్నాయి. ఇదే క్రమంలో సోమవారం కూడా ఢిల్లీ బులియన్ మార్కెట్లో తులం బంగారం ధర రూ.250 అధికమై రూ.78,700 పలికింది. కానీ, వెండి ధరలు మాత్రం తగ్గుముఖం పట్టాయి. కిలో వెండి ధర రూ.200 దిగొచ్చి రూ.94,200 నుంచి రూ.94,200కి దిగినట్లు ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ వెల్లడించింది. గ్లోబల్ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ ధర 2,671.50 డాలర్ల వద్ద, వెండి 32.20 డాలర్ల వద్ద కొనసాగుతున్నది.