ముంబై, నవంబర్ 13: మూరత్ ట్రేడింగ్‌లో మురిపించిన దేశీయ స్టాక్ మార్కెట్లు ఆ మరుసటి రోజే భారీ నష్టాల్లోకి జారుకున్నాయి. ఐటీ, కన్జ్యూమర్ డ్యూరబుల్, ఆర్థిక రంగ షేర్లు తీవ్ర ఒత్తిడికి గురికావడం మార్కెట్లపై ప్రతికూల ప్రభావం చూపింది. ముఖ్యంగా ద్రవ్యోల్బణ గణాంకాలు పెరుగుతాయన్న అంచనాలు మదుపరుల్లో అమ్మకాలవైపు నడిపించాయి. వీటికి తోడు విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు భారీగా నిధులను తరలించుకుపోవడం, బలహీనమైన రూపాయి పెట్టుబడిదారుల్లో సెంటిమెంట్‌ను ప్రభావితం చేశాయి. నష్టాల్లో ప్రారంభమైన సూచీలు చివరి వరకు అదే ట్రెండ్‌ను కొనసాగించాయి.
ఇంట్రాడేలో 400 పాయింట్లకు పైగా నష్టపోయిన 30 షేర్ల ఇండెక్స్ సూచీ 65 వేల పాయింట్ల దిగువకు పడిపోయింది. చివరకు 325.58 పాయింట్లు కోల్పోయి 64,933.87 పాయింట్ల వద్ద ముగిసింది. అటు నిఫ్టీ కూడా 82 పాయింట్లు కోల్పోయి 19,443.55 వద్ద నిలిచింది. అంతర్జాతీయ దేశాల్లో నెలకొన్న అనిశ్చిత పరిస్థితుల కారణంగా ఈక్విటీలు తీవ్ర ఒత్తిడికి గురయ్యాయని, పారిశ్రామిక వృద్ధిరేటు తగ్గుముఖం పట్టడం మదుపరుల్లో ఆందోళన పెరిగిందని జియోజిట్ ఫైనాన్షియల్ హెడ్ వినోద్ నాయర్ తెలిపారు.