Stock Markets | ముంబై, ఏప్రిల్ 17 : దేశీయ స్టాక్ మార్కెట్లు వరుస లాభాల్లో పరుగులు పెడుతున్నాయి. గురువారం బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్ఈ) ప్రధాన సూచీ సెన్సెక్స్ మరో 1,508.91 పాయింట్లు లేదా 1.96 శాతం పుంజుకొని 78వేల మార్కుకు ఎగువన 78,553.20 వద్ద స్థిరపడింది. నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ (ఎన్ఎస్ఈ) సూచీ నిఫ్టీ కూడా 414.45 పాయింట్లు లేదా 1.77 శాతం ఎగిసి 23,851.65 వద్ద నిలిచింది. దీంతో నాల్గోరోజూ సూచీలు లాభాల్లో ముగిసినైట్టెంది. ఈ నాలుగు రోజుల్లో సెన్సెక్స్ 4,706.05 పాయింట్లు లేదా 6.37 శాతం, నిఫ్టీ 1,452.50 పాయింట్లు లేదా 6.48 శాతం ఎగబాకాయి.
ప్రతీకార సుంకాలపై అమెరికాతో ఆయా దేశాలు చర్చలకు ఉపక్రమిస్తుండటం.. మార్కెట్ సెంటిమెంట్‌ను బలపర్చింది. ఈ క్రమంలోనే అమెరికా-జపాన్ మధ్య సంప్రదింపులు.. లాభాల కొనసాగింపునకు దోహదం చేశాయి. ఇదిలావుంటే బ్యాంకింగ్, టెలికం, ఆర్థిక సేవలు, సేవా రంగం, టెక్నాలజీ. ఎనర్జీ, ఆటో, హెల్త్‌కేర్ రంగాల షేర్లు 2.56 శాతం నుంచి 0.91 శాతం మేర లాభాలను అందిపుచ్చుకున్నాయి. ఆసియా మార్కెట్లలో దక్షిణ కొరియా, జపాన్, చైనా, హాంకాంగ్ సూచీలు లాభపడ్డాయి.