న్యూఢిల్లీ, మార్చి 16: ఒక రోజు విరామానంతరం బుధవారం తిరిగి స్టాక్ మార్కెట్ జోరుగా పెరిగింది. బీఎస్ఈ సెన్సెక్స్ 56,000 పాయింట్ల మార్క్‌ను అందుకుంది. ఈ సూచి 1,040 పాయింట్లు లాభపడి 56,817 పాయింట్ల వద్ద ముగిసింది. ఇదే రీతిలో ఎన్ఎస్ఈ నిఫ్టీ 312 పాయింట్లు ఎగిసి 16,975 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. వరుసగా ఐదు ట్రేడింగ్ సెషన్లలో ర్యాలీ జరిపిన మార్కెట్ మంగళవారం క్షీణించిన సంగతి తెలిసిందే. క్రమేపీ చమురు ధర తగ్గుతుండటం, రష్యా-ఉక్రెయిన్ల మధ్య జరుగుతున్న చర్యలు ఫలవంతం అవుతాయన్న ఆశాభావంతో తాజాగా ఇన్వెస్టర్లు కొనుగోళ్లు జరిపారని మార్కెట్ వర్గాలు తెలిపాయి. సెన్సెక్స్-30 షేర్లలో అన్నింటికంటే అధికంగా అల్ట్రాటెక్ సిమెంట్ 5 శాతం ర్యాలీ జరిపింది. యాక్సిస్ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ, హెచ్డీఎఫ్సీ, బజాజ్ ఫిన్సర్వ్, ఇన్ఫోసిస్, బజాజ్ ఫైనాన్స్‌లు 3-4 శాతం మధ్య పెరిగాయి. రంగాలవారీగా చూస్తే రియల్టీ ఇండెక్స్ 3.66 శాతం పెరగ్గా, మెటల్స్ సూచి 2.56 శాతం, ఆటో ఇండెక్స్ 2.09 శాతం చొప్పున పెరిగాయి. బీఎస్ఈ మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ సూచీలు 1.8 శాతం వరకూ ఎగిసాయి. మరోవైపు సన్‌ఫార్మా, పవర్గ్రిడ్లు స్వల్పంగా క్షీణించాయి. కొద్ది రోజులుగా భారీ విక్రయాలు జరుపుతున్న విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐలు) బుధవారం మాత్రం రూ. 300 కోట్ల విలువగల షేర్లను నికరంగా కొనుగోలు చేసినట్టు ఎక్సేంజీల గణాంకాలు వెల్లడిస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధర 100 డాలర్లలోపునకు తగ్గింది.
అంతర్జాతీయ ట్రెండ్ సానుకూలం
అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ కమిటీ వడ్డీ రేట్లపై వెల్లడించే నిర్ణయాన్ని వెల్లడించనున్న నేపథ్యంలో పలు ప్రపంచ దేశాల స్టాక్ సూచీలు ర్యాలీ జరపడం స్థానికంగా సెంటిమెంట్‌ను బలపర్చింది. గత రాత్రి అమెరికా మార్కెట్లు 2 శాతం వరకూ పెరగ్గా, బుధవారం ఉదయం ఆసియాలోని జపాన్, చైనా, హాంకాంగ్, కొరియా ఇండెక్స్ పాజిటివ్‌గా ముగిసాయి. యూరప్ స్టాక్ సూచీలు సైతం పెరిగాయి. మరోవైపు ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు అధికంగా ఉండబోదన్న అంచనాలకు నిపుణులు రావడం కూడా మార్కెట్లు బలపడటానికి కారణమయ్యింది. అమెరికాలో ద్రవోల్యణం నాలుగు దశాబ్దాల గరిష్టానికి చేరడంతో ఫెడ్ రేట్లు 50 బేసిస్ పాయింట్ల వరకూ పెరగవచ్చన్న అంచనాలు కొద్ది రోజుల క్రితం వరకూ ఉండగా, రష్యా-ఉక్రెయిన్ సంక్షోభంతో రేట్ల పెంపుదల 25 బేసిస్ పాయింట్లకే పరిమితమవుతుందంటూ తాజా అంచనాలు నెలకొన్నాయి. ఫెడ్ పెంపు 25 బేసిస్ పాయింట్లకే పరిమితమైతే, మార్కెట్‌కు ఊరట లభిస్తుందని, ఒడిదుడుకులు తగ్గుతాయని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ తెలిపారు.