ముంబై, సెప్టెంబర్ 29 : నిరుడు ఆల్‌టైమ్ హై రికార్డులతో ఉర్రూతలూగించిన దేశీయ స్టాక్ మార్కెట్లు.. గడిచిన ఏడాది కాలంగా మాత్రం ఉసూరుమనిపిస్తున్నాయి. అటు బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్ఈ), ఇటు నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ (ఎన్ఎస్ఈ) రెండూ మదుపరులకు నష్టాలనే మిగిల్చాయి మరి. బీఎస్ఈ ప్రధాన సూచీ సెన్సెక్స్ 5,400 పాయింట్లకుపైగా, ఎన్ఎస్ఈ సూచీ నిఫ్టీ 1,500 పాయింట్లదాకా పడిపోయాయి.
నిజానికి అంతర్జాతీయ మార్కెట్లలో చాలావరకు సూచీలు ఏడాదిగా నష్టాల్లోనే కదలాడుతున్నాయి. అయితే భారతీయ స్టాక్ మార్కెట్లు మాత్రం అనేక ప్రోత్సాహకాలిచ్చినా నిరాశపరుస్తున్నాయి. బడ్జెట్లో ఆదాయ పన్ను (ఐటీ) మినహాయింపు పెంపు, ఇటీవల వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) భారం తగ్గింపు, వరుస ద్రవ్యసమీక్షల్లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కీలక వడ్డీరేట్ల కోతలు, దేశీయ సంస్థాగత మదుపరుల పెట్టుబడులు స్థిరంగా సాగుతున్నా.. సూచీలు లాభాలకు దూరంగానే ట్రేడ్ అవుతున్నాయి. బీఎస్ఈ బ్లూచిప్ ఇండెక్స్ సెన్సెక్స్ విషయానికే వస్తే.. 6.5 శాతం క్షీణించింది. అలాగే బీఎస్ఈ స్మాల్, మిడ్‌క్యాప్ ఇండెక్స్‌లు 4 శాతానికిపైగా పతనమయ్యాయి.
మార్కెట్ నష్టాలకు దారితీసిన పరిస్థితుల గురించి మాట్లాడాల్సి వస్తే.. నిరాశాజనకంగా కార్పొరేట్ కంపెనీల ఆర్థిక ఫలితాలు, అమెరికాతో కుదరని వాణిజ్య ఒప్పందం, భారంగా మారిన సుంకాలు, విదేశీ పోర్ట్‌ఫోలియో మదుపరుల పెట్టుబడుల ఉపసంహరణ వంటివి ప్రధానంగా కనిపిస్తున్నాయి. ఈ ఏడాది దేశీయ సంస్థాగత మదుపరులు సుమారు 62 బిలియన్ డాలర్ల పెట్టుబడులు గుమ్మరించినా.. విదేశీ పోర్ట్‌ఫోలియో మదుపరులు దాదాపు 20 బిలియన్ డాలర్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. మ్యాచువల్ ఫండ్స్‌ల్లోకి కూడా ఇన్వెస్ట్మెంట్స్ క్షీణించాయి. వీటన్నిటి ప్రభావం మార్కెట్లపై ఉందని మెజారిటీ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు.
దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా ఏడోరోజూ నష్టపోయాయి. లాభాల్లో ప్రారంభమైనా అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన ప్రతికూల సంకేతాలు నష్టాల్లోకి నెట్టాయి. దీంతో సెన్సెక్స్ 61.52 పాయింట్లు కోల్పోయి 80,364.94 వద్ద నిలిచింది. నిఫ్టీ కూడా 19.80 పాయింట్లు నష్టపోయి 24,634.90 వద్ద స్థిరపడింది. వాహన, ఎఫ్ఎంసీజీ రంగ షేర్లు పడిపోయాయి.