ముంబై, జూన్ 25: దేశీయ స్టాక్ మార్కెట్లు కదంతొక్కాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల అంశాలకు తోడు ఇరాన్-ఇజ్రాయిల్ దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు తగ్గుముఖం పట్టడంతో మదుపరులు కొనుగోళ్లకు మొగ్గుచూపారు. ఫలితంగా దేశీయ మార్కెట్లు వరుసగా రెండోరోజు బుధవారం కూడా సూచీలు ఒక్క శాతం వరకు ఎగిశాయి. లాభాల్లో ప్రారంభమైన సూచీలు చివరివరకు అదే ట్రెండ్‌ను కొనసాగించాయి. ఒక దశలో 750 పాయింట్లకు పైగా ఎగబాకిన 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ చివరకు మార్కెట్ ముగిసే సమయానికి 700.40 పాయింట్లు అందుకొని 82,755.51 వద్ద ముగిసింది. మరో సూచీ నిఫ్టీ 200.40 పాయింట్లు అందుకొని 25,244.75 వద్ద స్థిరపడింది. అమెరికా సూచీలు భారీగా లాభపడటం దేశీయ మార్కెట్లకు కలిసొచ్చిందని దలాల్‌స్ట్రీట్ వర్గాలు వెల్లడించాయి. చమురు రిటైల్ అవుట్లెట్లను ఏర్పాటు చేయడానికి దేశీయ పారిశ్రామిక దిగ్గజాలు ముకేశ్ అంబానీ, గౌతమ్ అదానీలు చేతులు కలపడం కూడా మార్కెట్లో సెంటిమెంట్‌ను ప్రభావితం చేసిందన్నారు.
టైటాన్ 3.61 శాతం పెరిగి టాప్ గెయినర్‌గా నిలిచింది.
దీంతోపాటు ఇన్ఫోసిస్, మహీంద్రా అండ్ మహీంద్రా షేర్లు రెండు శాతానికి పైగబాగా బలపడ్డాయి.అలాగే ఎయిర్టెల్, టెక్ మహీంద్రా, టీసీఎస్, పవర్‌గ్రిడ్, హెచ్‌సీఎల్, ఎటర్నల్, అల్ట్రాటెక్, బజాజ్ ఫైనాన్స్, మారుతి, రిలయన్స్, టాటా స్టీల్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, హెచ్‌యూఎల్, ఎస్బీఐ, సన్‌ఫార్మా, ఐటీసీ, ఎల్అండ్టీ, అదానీ పోర్ట్స్, ఏషియన్ పెయింట్స్, టాటా మోటర్స్, ఐసీఐసీఐ బ్యాంక్, ఎన్టీపీసీ షేర్లు లాభాల్లో ముగిశాయి.యాక్సిస్ బ్యాంక్, కొటక్ బ్యాంక్, బీఈఎల్ షేర్లు మాత్రం నష్టపోయాయి.