ముంబై, మార్చి 4: దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా మూడో రోజూ నష్టపోయాయి. టారిఫ్‌ల పెంపు ఆందోళనలు, మరోవైపు విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు భారీగా నిధులను తరలించుకుపోతుండటం సూచీ 73 వేల దిగువకు పడిపోయింది 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్. చివరకు మార్కెట్ ముగిసే సమయానికి సూచీ 96.01 పాయింట్లు కోల్పోయి 72,989.93 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో 450 పాయింట్లకు పైగా నష్టపోయిన సూచీ చివర్లో ఈ భారీ నష్టాలను తగ్గించుకున్నది. మరో సూచీ నిఫ్టీ వరుసగా పదోరోజూ నష్టపోయింది. 36.65 పాయింట్లు కోల్పోయి 22,082.65 వద్ద ముగిసింది. ఒక దశలో 22 వేల దిగువకు పడిపోయింది. బ్లూచిప్ సంస్థలు భారీగా నష్టపోవడం వల్లనే సూచీలు ఒత్తిడికి గురయ్యాయని దలాల్‌స్ట్రీట్ వర్గాలు వెల్లడించాయి.
బ్లూస్టార్ 100 కోట్ల పెట్టుబడి
హైదరాబాద్, మార్చి 4: ప్రముఖ ఏసీల తయారీ సంస్థ బ్లూస్టార్ దూకుడు పెంచింది. ఈ వేసవి సీజన్లో కస్టమర్లను ఆకట్టుకోవడానికి ఒకేసారి 150 మాడళ్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. 0.8 టీఆర్ నుంచి 4 టీఆర్ రకాల కూలింగ్ సామర్థ్యాలతో విడుదల చేసిన ఈ ఏసీలు 3-స్టార్, 5-స్టార్ విభాగంలో లభించనున్నాయి. వీటి ప్రారంభ ధర రూ.28,990గా నిర్ణయించినట్లు కంపెనీ ఎండీ త్యాగరాజన్ చెప్పారు. వీటిలో దాదాపు 40 స్మార్ట్ వైఫై ఏసీ మాడళ్లు కూడా ఉన్నాయని, ఈ ఫీచర్‌తో ఉష్ణోగ్రత, ఫ్యాన్ స్పీడ్, కూల్/ఫ్యాన్ మోడ్, 12 గంటలపాటు ప్రతి గంటకు ఒకసారి స్విచ్ ఆన్/ఆఫ్ అయ్యేలా ముందుగా సెట్ చేసుకోవచ్చునని చెప్పారు. నూతన శ్రేణి ఏసీలను రూపొందించడానికి వచ్చే ఆర్థిక సంవత్సరంలో రూ.100 కోట్లకు పైగా ఖర్చు చేయనున్నట్లు ఆయన ప్రకటించారు.