Stocks | దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం నష్టాలతో ముగిశాయి. ఉదయం ట్రేడింగ్ మొదలైనప్పటి నుంచే ఒడుదొడుకుల మధ్య సాగింది. అంతర్జాతీయంగా ప్రతికూల పరిస్థితులకు తోడు విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు వాటాల అమ్మకాలకు దిగడం కూడా నష్టాలకు కారణం. వీక్లీ ఎఫ్ అండ్ ఓ ఎక్స్పైరీ, ఇన్వెస్టర్ల నుంచి అమ్మకాల ఒత్తిడితో సాగిన స్టాక్ మార్కెట్లలో ట్రేడింగ్ ముగిసే వరకూ అదే పరిస్థితి కొనసాగింది. ట్రేడింగ్ ముగిసే సమయానికి బీఎస్ఈ ఇండెక్స్ సెన్సెక్స్ 143 పాయింట్ల నష్టంతో 64,832 పాయింట్ల వద్ద ముగిస్తే, ఎన్ఎస్ఈ సూచీ నిఫ్టీ 48 పాయింట్ల పతనంతో 19,395 పాయింట్ల వద్ద స్థిర పడిది.
ఇన్వెస్టర్లు గురువారం లాభాల స్వీకరణకు ప్రాధాన్యం ఇచ్చారు. దీంతో అదానీ గ్రూప్ ఫ్లాగ్ షిప్ కంపెనీ.. అదానీ ఎంటర్ ప్రైజెస్ 1.7 శాతం, హెచ్యూఎల్, అదానీ పోర్ట్స్, టెక్ మహీంద్రా, టాటా కన్జూమర్ ప్రొడక్ట్స్, ఇన్ఫోసిస్, ఓఎన్జీసీ, బజాజ్ ఫైనాన్స్, టీసీఎస్, రిలయన్స్ ఇండస్ట్రీస్, యూపీఎల్, టైటాన్, జేఎస్డబ్ల్యూ స్టీల్ 0.8 శాతం వరకూ నష్టంతో ముగిశాయి.
మరోవైపు మహీంద్రా అండ్ మహీంద్రా, అపోలో హాస్పిటల్స్, కోల్ ఇండియా, హీరో మోటో కార్ప్, ఇండస్ ఇండ్ బ్యాంక్, పవర్ గ్రిడ్, టాటా మోటార్స్, మారుతిసుజుకి, ఎల్ అండ్ టీ తదితర షేర్లు 0.9 శాతం నుంచి 4.2 శాతం మధ్య పుంజుకున్నాయి.
బీఎస్ఈ మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.06 శాతం పుంజుకుంటే, స్మాల్ క్యాప్ 0.27 శాతం నష్టంతో ముగిసింది. నిఫ్టీ రియాల్టీ ఇండెక్స్ ఒక శాతానికి పైగా లాభ పడితే, నిఫ్టీ ఆటో 0.8 శాతం, నిఫ్టీ ఆయిల్ అండ్ గ్యాస్, ఎఫ్ఎంసీజీ, ఐటీ ఇండెక్స్ లు ఒక శాతం వరకూ నష్టపోయాయి.