ముంబై, నవంబర్ 28: దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం భారీగా నష్టపోయాయి. బ్లూచిప్ సంస్థల షేర్లు తీవ్ర అమ్మకాల ఒత్తిడికి గురికావడంతోపాటు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన ప్రతికూల సంకేతాలే ప్రధాన కారణం. అక్టోబర్ నెలకుగాను అమెరికాలో రిటైల్ ద్రవ్యోల్బణం 2.3 శాతానికి పెరగడం.. రాబోయే ద్రవ్యసమీక్షల్లో ఫెడ్ రిజర్వ్ వడ్డీరేట్ల కోతలకున్న అవకాశాలకు గండికొట్టింది. ఇక భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతలు సైతం మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. ఈ క్రమంలోనే మదుపరులు లాభాల స్వీకరణకు పెద్దపీట వేశారు. పెట్టుబడుల ఉపసంహరణకు దిగారు. ఫలితంగా ఐటీ, వాహన, కన్జ్యూమర్ డ్యూరబుల్ రంగ షేర్లు పతనమయ్యాయి. ఒక దశలో సెన్సెక్స్ 1,300 పాయింట్లకుపైగా దిగజారి 79 వేల పాయింట్ల దిగువకు పడిపోయింది. మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 1,190.34 పాయింట్లు లేదా 1.48 శాతం నష్టపోయి 79,043.74 వద్ద ముగిసింది. నిఫ్టీ 360.75 పాయింట్లు లేదా 1.49 శాతం క్షీణించి 23,914.15 వద్ద స్థిరపడింది.
గత రెండు రోజులుగా భారీ లాభాలతో కళకళలాడిన మదుపరులకు గట్టి షాక్తగిలింది. గురువారం ఒకేరోజు మదుపరులు రూ.1.50 లక్షల కోట్ల సంపదను కోల్పోయారు. ఇరు సూచీలు ఒక్క శాతానికి పైగా నష్టపోవడంతో బీఎస్ఈలో లిైస్టెన సంస్థల మార్కెట్ క్యాపిటల్ విలువ రూ.1,50,265.63 కోట్లు కరిగిపోయి రూ.4,42,98,083.42 కోట్లు(5.24 ట్రిలియన్ డాలర్లు)కి జారుకున్నది. అమెరికా మార్కెట్లలో భారీగా అమ్మకాలు జరగడంతో ఇప్పట్లో వడ్డీరేట్లు తగ్గే అవకాశాలు లేకపోవడం, అంతర్జాతీయ దేశాల్లో అనిశ్చిత పరిస్థితులు కొనసాగుతుండటం మదుపరుల్లో ఆందోళన పెంచిందని దలాల్‌స్ట్రీట్ వర్గాలు వెల్లడించాయి. ఐటీ రంగ సూచీ అత్యధికంగా 2.35 శాతం నష్టపోయింది.