ముంబై, ఆగస్టు 22: కొద్ది వారాలుగా పరుగులు తీసిన దేశీ స్టాక్ మార్కెట్ హఠాత్తుగా కుదేలయ్యింది. బీఎస్ఈ సెన్సెక్స్ సోమవారం 872 పాయింట్లు పతనమై 58,774 పాయింట్ల వద్ద ముగిసింది. గతవారమే 60,000 పాయింట్ల స్థాయిని దాటిన సెన్సెక్స్ వరుసగా రెండు రోజులపాటు భారీగా తగ్గడం గమనార్హం. నిఫ్టీ 268 పాయింట్లు క్షీణించి 17, 491 పాయింట్ల వద్ద నిలిచింది. పలు దేశాల కేంద్ర బ్యాంక్‌ల కఠిన ద్రవ్య విధానాలతో ప్రపంచ ఆర్థికాభివృద్ధి మందగిస్తుందన్న ఆందోళనతో అంతర్జాతీయ మార్కెట్లు క్షీణించిన ప్రభావం దేశీ సూచీలపై పడిందని విశ్లేషకులు తెలిపారు. అమెరికా ఫెడ్ చైర్మన్ వడ్డీ రేట్ల పెంపుపై వెల్లడించిన కఠిన వైఖరి డాలర్ ఇండెక్స్‌ను బలోపేతం చేసిందని, దీంతో మార్కెట్లు క్షీణించాయని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ సిద్ధార్థ్ ఖెమ్కా చెప్పారు.
రూ.6.57 లక్షల కోట్ల సంపద ఆవిరి
వరుసగా రెండు ట్రేడింగ్ రోజుల మార్కెట్ పతనంతో రూ.6.57 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరైపోయింది. బీఎస్ఈలో లిస్టయిన కంపెనీల మార్కెట్ విలువ రూ.2,73,95,003 కోట్లకు దిగింది.
రిలయన్స్‌ను దాటిన అదానీ
ముకేశ్ అంబానీ గ్రూప్ కంపెనీలు అధికాదాయాన్ని ఆర్జిస్తున్నప్పటికీ, రిలయన్స్ మార్కెట్ విలువను గౌతమ్ అదానీ గ్రూప్ అధిగమించింది. అదానీ గ్రూప్‌లోని ఏడు లిస్టెడ్ కంపెనీల మార్కెట్ విలువ తాజాగా రూ.19.43 లక్షల కోట్లకు చేరగా, ముకేశ్ కంపెనీల మార్కెట్ విలువ రూ.17.82 లక్షల కోట్లకు పరిమితమయ్యింది. కాగా, భారత పారిశ్రామిక గ్రూప్‌ల్లో అత్యంత విలువైనదిగా టాటా కొనసాగుతున్నది. ప్రస్తుతం టాటా గ్రూప్ కంపెనీల మార్కెట్ విలువ రూ.22.05 లక్షల కోట్లు.