Stock Markets | ముంబై, ఏప్రిల్ 25 : దేశీయ స్టాక్ మార్కెట్లపై యుద్ధమేఘాలు కమ్ముకున్నాయి. భారత్-పాకిస్థాన్ సరిహద్దు ప్రాంతాల్లో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొనడంతో మదుపరులు అమ్మకాలకు మొగ్గుచూపారు. నష్టాల్లో ప్రారంభమైన సూచీలు చివరి వరకు అదే ట్రెండ్‌ను కొనసాగించాయి. ఒక దశలో వెయ్యి పాయింట్లకు పైగా నష్టపోయిన 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ చివరకు వారాంతం ట్రేడింగ్ ముగిసే సరికి 588.90 పాయింట్లు కోల్పోయి 79,212.53 వద్ద ముగిసింది. మరో సూచీ నిఫ్టీ 207.35 పాయింట్లు పతనం చెంది 24,039.35 వద్ద ముగిసింది. పహల్గాంపై తీవ్రవాదులు దాడులు చేయడంతో భారత్-పాకిస్థాన్ దేశాల మధ్య మళ్లీ యుద్ధమేఘాలు కమ్ముకోవడం మార్కెట్ సెంటిమెంట్‌ను నిరాశపరిచిందని జియోజిట్ ఇన్వెస్ట్మెంట్ హెడ్ వినోద్ నాయర్ తెలిపారు. ఐటీ రంగ సూచీ మినహా అన్ని రంగాల సూచీలు తీవ్ర ఒత్తిడికి గురయ్యాయి.
స్టాక్ మార్కెట్లు వరుస నష్టాలతో మదుపరులు లక్షల కోట్ల సంపదను కోల్పోయారు. వరుసగా రెండు రోజుల్లో ఇన్వెస్టర్లు రూ.8.88 లక్షల కోట్ల సంపద హారతి కర్పూరంలా కరిగిపోయింది. దీంతో బీఎస్ఈలో లిైస్టెన కంపెనీల మార్కెట్ విలువ రూ.8,88,975.14 కోట్లు కరిగిపోయి రూ.4,21,58,900.91 కోట్లు(4.93 ట్రిలియన్ డాలర్లు)కు పరిమితమైంది.