ముంబై, ఆగస్టు 23: దేశీయ స్టాక్ మార్కెట్ల వరుస నష్టాలకు బ్రేక్‌పడింది. బ్యాంకింగ్, మెటల్, వాహన రంగ సూచీల నుంచి లభించిన మద్దతుతో సూచీలు తిరిగి కోలుకోగలిగాయి. భారీ నష్టాల్లో ప్రారంభమైన సూచీలకు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి లభించిన మద్దతుతో మంగళవారం సెన్సెక్స్ మళ్లీ 59 వేల మార్క్‌ను అధిగమించింది. ఇంట్రాడేలో 1,000 పాయింట్ల వరకు నష్టపోయిన 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ చివరకు 257.43 పాయింట్లు లాభపడి 59,031.30 వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 86.80 పాయింట్లు కోలుకొని 17,577.50 వద్ద ముగిసింది. ఐటీ, ఎఫ్ఎంసీజీ రంగ షేర్లలో నెలకొన్న అనిశ్చితి కారణంగా ప్రారంభంలో భారీగా నష్టపోయింది. ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయడానికి అమెరికా ఫెడరల్ రిజర్వు మరోసారి వడ్డీరేట్లను పెంచనున్నదన్న వార్తలు గ్లోబల్ మార్కెట్లలో అలజడి సృష్టించింది. చివరకు బ్యాంకింగ్, మెటల్, వాహన రంగ షేర్లు తిరిగి కోలుకోవడం సూచీలు లాభాల్లోకి వచ్చాయి.