Stocks | అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు రావడంతో దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం లాభాలతో ముగిశాయి. మెక్సికో, కెనడాలపై విధించిన టారిఫ్‌లను తాత్కాలికంగా నిలిపేస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడంతో ఇన్వెస్టర్లలో సెంటిమెంట్ బలపడింది. ఫలితంగా బీఎస్ఈ ఇండెక్స్ సెన్సెక్స్, ఎన్ఎస్ఈ సూచీ నిఫ్టీ బల పడ్డాయి.
బీఎస్ఈ-30 ఇండెక్స్ సెన్సెక్స్ ఇంట్రాడే ట్రేడింగ్‌లో 78,658.59 పాయింట్ల గరిష్టానికి దూసుకెళ్లి, ట్రేడింగ్ ముగిసే సమయానికి 1397.07 పాయింట్ల లబ్ధితో 78,483.81 పాయింట్ల వద్ద ముగిసింది. మరోవైపు ఎన్ఎస్ఈ-50 సూచీ నిఫ్టీ సైతం ఇంట్రాడే ట్రేడింగ్‌లో 23,762.75 – 23,423.15 పాయింట్ల మధ్య తచ్చాడి.. ట్రేడింగ్ ముగిసే సమయానికి 387.20 పాయింట్లు పుంజుకుని 23,739.25 పాయింట్ల వద్ద స్థిర పడింది.
బీఎస్ఈ సెన్సెక్స్‌లో లార్సెన్ అండ్ టర్బో, ఇండస్ఇండ్ బ్యాంక్, అదానీ పోర్ట్స్, టాటా మోటార్స్, రిలయన్స్ తదితర షేర్లు లాభ పడ్డాయి. మరోవైపు ఐటీసీ హోటల్స్, జొమాటో, నెస్లే ఇండియా, హిందూస్థాన్ యూనీ లివర్, మారుతి సుజుకి నష్టపోయాయి. అంతర్జాతీయంగా ఔన్స్ బంగారం 2847 డాలర్ల వద్ద, బ్రెంట్ క్రూడాయిల్ బ్యారెల్ 75.13 డాలర్ల వద్ద ట్రేడవుతున్నాయి.
ఎన్ఎస్ఈ-50లో 39 స్టాక్స్ లాభాలతో ముగిశాయి. శ్రీరామ్ ఫైనాన్స్, లార్సెన్ అండ్ టర్బో, భారత్ ఎలక్ట్రానిక్స్, అదానీ పోర్ట్స్, ఇండస్ఇండ్ బ్యాంక్ తదితర స్టాక్స్ 5.65 శాతం వరకూ లాభ పడ్డాయి. మరోవైపు, ట్రెంట్, ఐటీసీ హోటల్స్, బ్రిటానియా, హీరో మోటో కార్ప్, నెస్లే ఇండియా తదితర స్టాక్స్ 6.44 శాతం వరకూ నష్టపోయాయి.