ముంబై, జూలై 12: దేశీయ స్టాక్ మార్కెట్ల రికార్డుల పరంపర కొనసాగుతున్నది. ఐటీ, టెక్నాలజీ రంగ షేర్ల నుంచి లభించిన మద్దతుతో లాభాల్లో ప్రారంభమైన సూచీలు చివరివరకు ఇదే ట్రెండ్‌ను కొనసాగించాయి. దేశీయ టెక్నాలజీ దిగ్గజం టీసీఎస్ అంచనాలకుమించి లాభాలను ప్రకటించడంతో మదుపరుల్లో ఉత్సాహాన్ని నింపింది. వీటికితోడు అమెరికా ఫెడరల్ రిజర్వు వచ్చే సమీక్షలో వడ్డీరేట్లను తగ్గించే అవకాశాలు ఉండటం కూడా సూచీలు కదం తొక్కడానికి ప్రధాన కారణంగా నిలిచాయి. రిలయన్స్, ఇన్ఫోసిస్ షేర్లు లాభాల్లో ముగియడం పెట్టుబడిదారుల్లో సెంటిమెంట్‌ను మెరుగుపరిచింది. ఒక దశలో వెయ్యి పాయింట్లకు పైగా లాభపడిన సెన్సెక్స్ వారాంతం ట్రేడింగ్ ముగిసే సరికి 622 పాయింట్లు అందుకొని రికార్డు స్థాయి 80,519.34 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో 996.17 పాయింట్లు(1.24 శాతం) లాభపడి ఆల్-టైం హై 80,893.51 వద్దకు చేరుకున్నది. మరోసూచీ నిఫ్టీ 186.20 పాయింట్లు పెరిగి 24,502.15 వద్ద స్థిరపడింది.
టీసీఎస్ షేరు దూకుడు
దేశీయ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్) షేరు రికార్డు స్థాయిలో దూసుకుపోయింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక ఫలితాల్లో అంచనాలకుమించి రాణించడంతో కంపెనీ షేరు ఏడు శాతం వరకు లాభపడి టాప్ గెయినర్‌గా నిలిచింది. 6.68 శాతం లాభపడింది. దీంతోపాటు ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్నాలజీ, టెక్ మహీంద్రా షేర్లు మూడు శాతానికి పైగా లాభపడ్డాయి. అలాగే యాక్సిస్ బ్యాంక్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, రిలయన్స్, ఎల్అండ్టీ, నెస్లె, ఎస్బీఐ, ఇండస్ఇండ్ బ్యాంక్, మహీంద్రా, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐటీసీ, ఎన్టీపీసీలు లాభాల్లో ముగిశాయి. కానీ, మారుతి, ఏషియన్ పెయింట్స్, కొటక్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, ఎయిర్‌టెల్‌లు నష్టపోయాయి.