ముంబై, నవంబర్ 6:దేశీయ స్టాక్ మార్కెట్లు భారీగా లాభపడ్డాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ విజయకేతనం ఎగురవేయడంతో మదుపరుల్లో జోష్ పెంచింది. దేశీయ మదుపరులతోపాటు విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు కొనుగోళ్లకు మొగ్గుచూపడంతో వరుసగా రెండోరోజూ సూచీలు లాభాల్లో ముగిశాయి. ముఖ్యంగా ఐటీ, ఫార్మా రంగ షేర్లకు మదుపరుల నుంచి లభించిన మద్దతుతో సెన్సెక్స్ తిరిగి 80 వేల మైలురాయిని అధిగమించింది. ఇంట్రాడేలో వెయ్యి పాయింట్లకు పైగా లాభపడిన 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ చివరకు 901.50 పాయింట్లు లేదా 1.13 శాతం అందుకొని 80,378.13 వద్ద ముగిసింది. అటు ఎన్ఎస్ఈ నిఫ్టీ సైతం 270.75 పాయింట్లు లేదా 1.12 శాతం లాభపడి 24,484.05 వద్ద స్థిరపడింది. దీంతో మదుపరులు లాభాల జడివానలో తడిసిముద్దయ్యారు. వరుసగా రెండు రోజులుగా సూచీలు కదంతొక్కడంతో మదుపరుల సంపద రూ.10 లక్షల కోట్లకు పైగా పెరిగింది. బీఎస్ఈలో లిైస్టెన కంపెనీల విలువ రూ.10,47,565.48 కోట్లు పెరిగి రూ.4,52,58,633.53 కోట్లు(5.37 ట్రిలియన్ డాలర్లు)కు చేరుకున్నది. వరుస సెషన్లలో సెన్సెక్స్ రెండు శాతానికి పైగా లాభపడినట్లు అయింది.
ఐటీ షేర్లలో జోష్
దేశీయ ఐటీ సంస్థల షేర్లు కదంతొక్కాయి. ట్రంప్ గెలువడంతో ఐటీ సంస్థలకు వచ్చిన ఇబ్బందేమి లేదని అంచనాలు నెలకొనడంతో ఈ రంగ షేర్లు నాలుగు శాతం వరకు లాభపడ్డాయి. దీంట్లో ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ షేరు అత్యధికంగా 4.21 శాతం లాభపడి టాప్ గెయినర్‌గా నిలిచింది. దీంతోపాటు టెక్ మహీంద్రా 3.85 శాతం, హెచ్‌సీఎల్ టెక్నాలజీ 3.71 శాతం, పెర్సిస్టెంట్ సిస్టమ్స్ 5.86 శాతం, ఎల్‌టీఐమైండ్‌ట్రీ 4.75 శాతం, విప్రో 3.75 శాతం చొప్పున లాభపడ్డాయి. దీంతోపాటు అదానీ పోర్ట్స్, ఎల్అండ్టీ, మారుతి, రిలయన్స్ షేర్లు లాభాల్లో ముగిశాయి. కానీ, టైటాన్, ఇంస్ఇండ్ బ్యాంక్, హెచ్‌యూఎల్, యాక్సిస్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్‌ల షేర్లు నష్టపోయాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ గెలువడంతో అంతర్జాతీయ మార్కెట్లలో రిలీఫ్ ర్యాలీ నడిచిందని, రాజకీయ అనిశ్చిత పరిస్థితులు తగ్గుముఖం పట్టనుండటం సూచీల్లో జోష్ పెంచాయని జియోజిట్ ఫైనాన్షియల్ సర్వీసెస్ హెడ్ వినోద్ నాయర్ తెలిపారు. రంగాలవారీగా చూస్తే ఐటీ అత్యధికంగా 4.04 శాతం లాభపడగా, టెక్ 3.37 శాతం, రియల్టీ 2.68 శాతం, ఇండస్ట్రీయల్స్ 2.66 శాతం, సర్వీసెస్ 2.53 శాతం, యుటిలిటీ 2.44 శాతం చొప్పున పెరిగాయి.