ముంబై, సెప్టెంబర్ 20: దేశీయ స్టాక్ మార్కెట్లు మరో మైలురాయిని అధిగమించాయి. రోజుకొక రికార్డును బద్దలు కొడుతున్న సూచీలు శుక్రవారం 84 వేల మైలురాయిని అధిగమించి చారిత్రక గరిష్ఠ స్థాయిలో ముగిసింది. బ్యాంకింగ్ రంగ సూచీలు భారీగా పుంజుకోవడంతోపాటు అమెరికా, ఆసియా మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల అంశాలు సూచీల్లో జోష్ పెంచింది.
ఇరు సూచీలు ఆల్‌టైం రికార్డు స్థాయిలో ముగియడం విశేషం. ఇంట్రాడేలో 1,500 పాయింట్లకు పైగా లాభపడి 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ చివరకు 1,359.51 పాయింట్లు(1.63 శాతం) అందుకొని చారిత్రక గరిష్ఠ స్థాయి 84,544.31 వద్ద ముగిసింది. అటు మరో సూచీ నిఫ్టీ సైతం 26 వేల దిశగా పయనిస్తున్నది. మార్కెట్ ముగిసే సమయానికి నిఫ్టీ 375 పాయింట్లు అందుకొని 25,791 దగ్గర స్థిరపడింది.
గతవారంలోనే 83 వేల మార్క్‌ను అధిగమించిన సెన్సెక్స్ కేవలం ఐదు ట్రేడింగ్ రోజుల్లోనే మరో మైలురాయి 84 వేల మార్క్‌ను చేరుకోవడం విశేషం. దీంతో మదుపరుల సంపద మరో 6 లక్షల కోట్లకు పైగా పెరిగింది. పెట్టుబడిదారులు ఎగబడి కొనుగోళ్లు జరపడంతో సూచీలతోపాటు మదుపరుల సంపద కూడా అమాంతం పెరిగింది. ఈక్విటీల ర్యాలీతో బీఎస్ఈలో లిైస్టెన కంపెనీల విలువ రూ.6,24,468.11 కోట్లు పెరిగి రూ.4,71,71,745.83 కోట్లు(5.65 ట్రిలియన్ డాలర్లకు) చేరుకున్నది.