డెరివేటివ్స్ సెగ్మెంట్లో ఇండివీడ్యువల్ స్టాక్స్ ప్రవేశం కోసం క్యాపిటల్ మార్కెట్స్ రెగ్యులేటర్ సెబీ సోమవారం పలు కఠిన నిబంధనల్ని ప్రతిపాదించింది. వీటి ప్రకారం స్టాక్ మార్కెట్లలో ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్ (ఎఫ్అండ్వో) సెగ్మెంట్ నుంచి స్థిరంగా తక్కువ టర్నోవర్తోనే ట్రేడ్ అవుతున్న స్టాక్స్ దూరం కానున్నాయి. దీంతో పరిమాణం, విలువ, మార్కెట్ లావాదేవీల ఆధారంగా భారీ స్టాక్స్ మాత్రమే డెరివేటివ్స్ సెగ్మెంట్లో ఉండాలన్నది సెబీ ఉద్దేశంగా తెలుస్తున్నది. ఇదిలావుంటే నామినీని పేర్కొనని మ్యూచువల్ ఫండ్ ఫోలియోలను, డీమ్యాట్ ఖాతాలను స్తంభింపజేయాలన్న నిబంధనను మదుపరుల కోసం సెబీ తొలగించింది. అలాగే భౌతిక రూపంలో సెక్యూరిటీలను కలిగి ఉన్న ఇన్వెస్టర్లు.. డివిడెండ్, వడ్డీ లేదా రిడెంప్షన్ చెల్లింపులకు అర్హులేనన్నది. ఇక వచ్చే నెలలో 7 సంస్థలకు చెందిన 22 ఆస్తులను సెబీ వేలం వేయనున్నది. మదుపరుల నుంచి అక్రమంగా వసూలు చేసిన నగదును రికవరీ చేయడంలో భాగంగా జూలై 8న పైలాన్ గ్రూప్, విబ్గ్యార్ గ్రూప్, జీబీసీ ఇండస్ట్రియల్ కార్ప్ గ్రూప్, టవర్ ఇన్ఫోటెక్ గ్రూప్, వారిస్ గ్రూప్, టీచర్స్ వెల్ఫేర్ క్రెడిట్ అండ్ హోల్డింగ్ గ్రూప్, అనెక్స్ ఇన్ఫ్రాసంస్థ ల ఆస్తులను విక్రయానికి పెట్టనున్నారు.