ముంబై, సెప్టెంబర్ 17: క్యాపిటల్ మార్కెట్స్ రెగ్యులేటర్ సెబీ.. నాన్-క్యాష్, నాన్-అగ్రికల్చర్ కమోడిటీ డెరివేటివ్ మార్కెట్లలో బ్యాంకులు, ఇన్సూరెన్స్ కంపెనీలు, పెన్షన్ ఫండ్స్ పెట్టుబడులను అనుమతించాలని యోచిస్తున్నది. ఈ క్రమంలోనే ఈ విషయమై కేంద్ర ప్రభుత్వంతో చర్చించాలని చూస్తున్నట్టు బుధవారం సెబీ చైర్మన్ తుహిన్ కాంత పాండే తెలిపారు. కాగా, నాన్-క్యాష్ సెటిల్డ్, నాన్-అగ్రికల్చరల్ కమోడిటీ డెరివేటివ్ కాంట్రాక్టుల్లో ట్రేడింగ్‌కు ఫారిన్ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల (ఎఫ్‌పీవో)ను అనుమతించాలన్న ప్రతిపాదననూ పరిశీలిస్తున్నట్టు ఇక్కడ ఎంసీఎక్స్ నిర్వహించిన ఓ కార్యక్రమానికి హాజరైన ఆయన చెప్పారు.
ఆర్థిక వ్యవస్థలో కమోడిటీ డెరివేటివ్ మార్కెట్లు కీలకపాత్ర పోషిస్తాయన్న పాండే.. ప్రపంచ స్థాయిలో ధరలను అనుసరించే స్థాయి నుంచి ఆ ధరలను నిర్ణయించే స్థాయికి భారత్ ఎదగాలన్నదే లక్ష్యమని పేర్కొన్నారు. ఇక డిసెంబర్‌కల్లా కాంప్లియెన్స్ రిపోర్టుల కోసం కామన్ రిపోర్టింగ్ మెకానిజంలో కమోడిటీ-స్పెసిఫిక్ బ్రోకర్లనూ సమ్మిళితం చేయనున్నట్టు పాండే ఈ సందర్భంగా తెలియజేశారు.