SEBI Big Releif | కార్పొరేట్ సంస్థలకు స్టాక్ మార్కెట్ల నియంత్రణ సంస్థ.. సెబీ.. బిగ్ రిలీఫ్ ఇచ్చింది. ఆయా కార్పొరేట్ సంస్థల చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ (ఎండీ) పదవుల బాధ్యతలను విభజించాలన్న నిబంధన స్వచ్ఛందంగానే అమలు చేయనున్నట్లు తెలిపింది. ఇంతకుముందు ఈ నిబంధనను తప్పనిసరి చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఇంతకుముందు ఆదేశాల ప్రకారం వచ్చే ఏప్రిల్ లోగా లిస్టెడ్ కంపెనీల యాజమాన్యాలు.. చైర్ పర్సన్ లేదా చైర్మన్, ఎండీ బాధ్యతలను తప్పనిసరిగా విడదీయాల్సి ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ నిబంధన తప్పనిసరిగా అమలు చేయాలని తాము భావించట్లేదని సెబీ తెలిపింది. మంగళవారం సంస్థ బోర్డు సమావేశం తర్వాత జారీ చేసిన ప్రకటనలో ఈ సంగతి తెలిపింది.
స్టాక్ మార్కెట్లలో సులభతర వాణిజ్యాన్ని మరింత మెరుగు పరిచేందుకు తర్వాతీ దశ సంస్కరణలు చేపట్టాలని సెబీకి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సూచించారు. సెబీ బోర్డు సమావేశంలో ఆమె మాట్లాడుతూ భవిష్యత్లో అమెరికా ఫెడరల్ రిజర్వ్ తీసుకునే నిర్ణయాలతో దేశీయ మార్కెట్లలో తలెత్తే అనిశ్చితులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు.
ప్రస్తుతం సెబీ తీసుకుంటున్న నిర్ణయాలను నిర్మలా సీతారామన్ స్వాగతించారు. మార్కెట్ మధ్యవర్తిత్వ ఖర్చులు తగ్గించడంతోపాటు ఇన్వెస్టర్లకు రక్షణ బలోపేతానికి మరిన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్పొరేట్ బాండ్ మార్కెట్, గ్రీన్ బాండ్ మార్కెట్లను మరింత అభివృద్ధి చేయాలని పిలుపునిచ్చారు.
చైర్మన్,ఎండీ, సీఈవో బాధ్యతలను విభజించాలన్న నిబంధనను స్వచ్ఛందంగానే అమలు చేయాలన్న సెబీ నిర్ణయాన్ని ఇండస్ట్రీ స్వాగతించింది. సెబీ నిర్ణయం అభినందనీయం అని ఇండియన్ కాన్పిడరేషన్ ఆఫ్ ఇండస్ట్రీ (సీఐఐ), ఫిక్కీ పేర్కొన్నాయి.