న్యూఢిల్లీ, జూలై 4 : దేశీయ స్టాక్ మార్కెట్లలో ఘరానా మోసం వెలుగుచూసింది. డెరివేటివ్స్ సెగ్మెంట్లో పొజీషన్లను తీసుకోవడం ద్వారా స్టాక్ ఇండీసెస్ను ఏమార్చి అమెరికాకు చెందిన జేన్ స్ట్రీట్ గ్రూప్ వేల కోట్ల రూపాయల లాభాలను అక్రమంగా చేజిక్కించుకున్నట్టు తేలింది. దీంతో క్యాపిటల్ మార్కెట్స్ రెగ్యులేటర్ సెబీ.. సెక్యూరిటీస్ మార్కెట్ల నుంచి జేన్ స్ట్రీట్ గ్రూప్‌ను నిషేధించింది. ఈ గ్రూప్‌లోని జేఎస్ఐ ఇన్వెస్ట్మెంట్స్, జేఎస్ఐ2 ఇన్వెస్ట్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్, జేన్ స్ట్రీట్ సింగపూర్ ప్రైవేట్ లిమిటెడ్, జేన్ స్ట్రీట్ ఆసియా ట్రేడింగ్ సంస్థలపైనా ఆంక్షలు పెట్టింది. తదుపరి ఆదేశాలు ఇచ్చేదాకా సెక్యూరిటీ మార్కెట్ లావాదేవీల్లో పాల్గొనరాదన్నది. అంతేగాక చట్టవిరుద్ధంగా ఆర్జించిన రూ.4,843 కోట్లను చెల్లించాలంటూ జేన్ స్ట్రీట్‌ను సెబీ ఆదేశించింది. సెబీ చరిత్రలోనే ఈ స్థాయి మొత్తాన్ని జప్తు చేస్తుండటం ఇదే తొలిసారి.
నిఫ్టీ ఇండెక్స్ ఆప్షన్స్ సెగ్మెంట్లతోపాటు అధిక ద్రవ్య లావాదేవీలు జరిగే బ్యాంక్ నిఫ్టీ ద్వారా అక్రమంగా లాభాలను సొంతం చేసుకోవడానికి స్టాక్ మార్కెట్లలోని ఇండెక్స్ స్థాయిల్లో అవకతవకలకు పాల్పడుతున్నదన్న ఆరోపణల నేపథ్యంలో జేన్ స్ట్రీట్ గ్రూప్‌పై సెబీ దృష్టి పెట్టింది. ఈ క్రమంలో చేపట్టిన దర్యాప్తులో 2023 జనవరి నుంచి 2025 మే వరకు 21కిపైగా ఎక్స్పైరీ డేస్‌లో ఆప్షన్స్ మార్కెట్లో భారీగా తీసుకున్న పొజీషన్ల నుంచి లాభాలను అందుకోవడానికి, ఇండెక్స్ కదలికల్ని ప్రభావితం చేయడానికి క్యాష్, ఫ్యూచర్స్ మార్కెట్లలో పెద్ద ఎత్తున ట్రేడింగ్‌లకు గ్రూప్ పాల్పడినట్టు తేలింది.
జేన్ స్ట్రీట్ గ్రూప్ ప్రధానంగా రెండు వ్యూహాలను అమలుపర్చినట్టు సెబీ గుర్తించింది. ట్రేడింగ్ ఉన్న రోజున ఉదయం బ్యాంక్ నిఫ్టీ స్టాక్స్, ఫ్యూచర్స్‌లో భారీగా కొనుగోళ్లకు దిగ డం, మధ్యాహ్నం అదే రీతిలో వాటిని అమ్మేయడం చేస్తూ సున్నితమైన క్లోజింగ్‌కు ప్రయత్నించేది. అయితే ఎక్స్పైరీ డే నాడు చివరి రెండు గంటల ట్రేడింగ్ సమయంలో ఇండెక్స్ స్థాయిలను ప్రభావితం చేసేలా క్రయవిక్రయాలకు దిగేది. ఇలా దాదాపు రూ.4,843 కోట్ల లాభాలను జేన్ స్ట్రీట్ పొందినట్టు సెబీ తెలిపింది. అయితే జనవరి 2023 నుంచి మార్చి 2025 వరకు ఇండెక్స్ ఆప్షన్స్ ట్రేడింగ్ నుంచి రూ.44,358 కోట్ల లాభాలను అందుకున్నట్టు సెబీ చెప్తున్నది. కానీ స్టాక్ ఫ్యూచర్స్‌లో రూ.7,208 కోట్లు, ఇండెక్స్ ఫ్యూచర్స్‌లో రూ.191 కోట్లు, క్యాష్ మార్కెట్లో రూ.288 కోట్లు నష్టపోయిందని, దీంతో అక్రమ ట్రేడింగ్ ద్వారా కంపెనీ మొత్తం నికర లాభాలు రూ. 36,671 కోట్లుగా ఉన్నట్టు వివరించింది.
జేన్ స్ట్రీట్ అక్రమాల నేపథ్యంలో నువమా వెల్త్, ఏంజెల్ వన్ వంటి స్టాక్ బ్రోకింగ్ సంస్థల షేర్లతోపాటు ప్రధాన స్టాక్ ఎక్సేంజ్ బీఎస్ఈ, డిపాజిటరీ సీడీఎస్ఎల్ షేర్లు శుక్రవారం ట్రేడింగ్‌లో భారీగా నష్టపోయాయి. సెబీ కొరడా ఝళిపిస్తే వీటన్నిటి వ్యాపారం ఏవిధంగా ప్రభావితమవుతుందోనన్న భయాల మధ్య ఇన్వెస్టర్లు ఈ షేర్ల అమ్మకాలకు దిగారని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. కాగా, నువమా వెల్త్ మేనేజ్మెంట్ షేర్ విలువ గరిష్ఠంగా 11.26 శాతం పడిపోయి బీఎస్ఈలో రూ.7,263.10 వద్ద ముగిసింది. అలాగే ఏంజెల్ వన్ షేర్ 5.94 శాతం, బీఎస్ఈ షేర్ 6.42 శాతం, సీడీఎస్ఎల్ షేర్ విలువ 2.29 శాతం మేర కోల్పోయాయి.