Madhabi Buch | భారత్ స్టాక్ మార్కెట్ల నియంత్రణ సంస్థ ‘సెబీ’, సెబీ చైర్ పర్సన్ వ్యక్తిత్వాన్ని దెబ్బ తీసేందుకే అమెరికా కేంద్రంగా పనిచేస్తున్న షార్ట్ సెల్లర్ ‘హిండెన్ బర్గ్ రీసెర్చ్’ ఆరోపణలు చేసిందని సెబీ చైర్ పర్సన్ మాధాబీ పురీ బుచ్, ఆమె భర్త ధావల్ బుచి పేర్కొన్నారు. హిండెన్ బర్గ్ రీసెర్చ్ శనివారం తమపై చేసిన ఆరోపణలకు ఆదివారం మాధాబీ పురీ బుచ్ దంపతులు వివరణాత్మక ప్రకటన చేశారు. ‘సెబీ విశ్వసనీయతను, సెబీ చైర్ పర్సన్ వ్యక్తిత్వాన్ని దెబ్బ తీసేందుకు వారు ఆరోపణలు చేశారు’ అని ఆ ప్రకటన పేర్కొంది.
అదానీ గ్రూప్ అనుబంధ ఆఫ్ షోర్ కంపెనీల్లో మాధాబి పురీ బుచి పెట్టుబడులు ఉన్నందు వల్లే ఆ సంస్థకు వ్యతిరేకంగా చర్యలు తీసుకునేందుకు సెబీ చైర్ పర్సన్ అయిష్టత చూపుతున్నారని హిండెన్ బర్గ్ శనివారం పేర్కొన్న సంగతి తెలిసిందే. దీనిపై స్పందించిన బుచ్ దంపతులు.. హిండెన్ బర్గ్ ఆరోపణలు నిరాధారం అని పేర్కొన్నారు. మాధాబీ పురీ బుచ్.. సెబీ చైర్ పర్సన్ గా పని చేస్తుండగా, బ్లాక్ స్టోన్ సీనియర్ సలహాదారుగా ధావల్ బుచ్ పని చేస్తున్నారు.
2017లో సెబీ పూర్తికాల సభ్యురాలిగా చేరడానికి రెండేండ్ల ముందే ఐఐఎఫ్ఎల్ వెల్త్ మేనేజ్మెంట్ ప్రమోట్ చేసిన సింగపూర్ సంస్థలో తమ పెట్టుబడులు పెట్టామని బుచ్ దంపతులు తెలిపారు. తమ బాల్య స్నేహితుడు అనిల్ అహుజా సలహా మేరకే రెండు ఫండ్ సంస్థల్లో పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించుకున్నట్లు బుచ్ దంపతులు తమ ప్రకటనలో వెల్లడించారు. అప్పుడు మారిషస్ కేంద్రంగా పని చేస్తున్న ఐపీఈ ప్లస్ ఫండ్ వ్యవస్థాపకుడు- చీఫ్ ఇన్వెస్ట్ మెంట్ ఆఫీసర్ గా అనిల్ అహుజా ఉన్నారని హిండెన్ బర్గ్ పేర్కొంది.
అదానీ పవర్ (2007-08)లో 3ఐ ఇన్వెస్ట్ ఫండ్ నామినీగా కూడా అనిల్ అహుజా ఉన్నారని హిండెన్ బర్గ్ గుర్తు చేసింది. 2017 జూన్ నాటికి తొమ్మిదేండ్ల పాటు అదానీ ఎంటర్ ప్రైజెస్ డైరెక్టర్ గానూ అనిల్ అహుజా పని చేశారని హిండెన్ బర్గ్ తెలిపింది. అదానీ గ్రూప్ సంస్థలపై గతంలో చేసిన ఆరోపణలకు సమాధానం ఇవ్వాలని తాము జారీ చేసిన నోటీసుకు స్పందించకుండా సెబీ విశ్వసనీయతపైనా దాడి చేయడంతోపాటు తమ వ్యక్తిత్వాన్ని హిండెన్ బర్గ్ దెబ్బ తీస్తున్నదని బుచ్ దంపతులు పేర్కొన్నారు.