SEBI Ban on Anil Ambani | రిలయన్స్ హోం ఫైనాన్స్ లిమిటెడ్ (ఆర్హెచ్ఎఫ్ఎల్) అధినేత అనిల్ అంబానీతోపాటు మరో ముగ్గురిపై సెబీ నిషేధం విధించింది. తదుపరి ఆదేశాలు జారీ చేసే వరకు ఈ నిషేధం అమల్లో ఉంటుందని స్పష్టం చేసింది. రిలయన్స్ హోం ఫైనాన్స్ నిధులను స్వాహా చేశారని అనిల్ అంబానీపై అభియోగం. అనిల్ అంబానీతోపాటు మిగతా వారిపై దర్యాప్తు ఎందుకు చేపట్టకూడదో తెలియజేయాలని పేర్కొంటూ నోటీసులు జారీ చేసింది.
తదుపరి ఆదేశాలు జారీ చేసే వరకు అనిల్ అంబానీతోపాటు మరో ముగ్గురు ఏ ఇతర లిస్టెడ్ కంపెనీ ద్వారా గానీ, స్టాక్ మార్కెట్ ఇంటర్మీడియటరీద్వారా గానీ, పబ్లిక్ కంపెనీ ద్వారా గానీ నిధుల సేకరణకు పూనుకోవద్దని సెబీ స్పష్టం చేసింది. తదుపరి ఉత్తర్వులు అందే వరకు ఈ వ్యక్తులు నిధుల సమీకరణ చేపట్టరాదని సెబీ జారీ చేసిన 100 పేజీల మధ్యంతర ఆదేశాల్లో స్పష్టం చేసింది.
అనిల్ అంబానీతో పాటు అమిత్ బప్నా, రవీంద్ర సుధాకర్, పింకేశ్ ఆర్షాపై కూడా సెబీ నిషేధం విధించింది. రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ లిమిటెడ్ (ఆర్హెచ్ఎఫ్ఎల్) 2018-19లో అనేక రుణాలు తీసుకున్న సంస్థలకు రుణాలు పంపిణీ చేసిన విధానాన్ని సెబీ విచారణ పరిశీలించిందని మార్కెట్ వర్గాలు అంటున్నాయి. కనీసం 13 సంస్థలకు నిధులను బదిలీ చేసిందని సెబీ కనుగొన్నది.