న్యూఢిల్లీ, ఆగస్టు 9: స్టాక్ మార్కెట్ నియంత్రణ మండలి సెబీ మరో కీలక నిర్ణయం తీసుకున్నది. మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్లపై ప్రస్తుతం విధిస్తున్న లావాదేవీలపై చార్జీలను పూర్తిగా ఎత్తివేస్తున్నట్టు శనివారం సెబీ ప్రకటించింది. ఈ నిర్ణయం అన్ని రకాల అసెట్ మేనేజ్మెంట్ కంపెనీలకు వర్తించనున్నదని పేర్కొంది. మే 2023లో పబ్లిక్ కన్సల్టేషన్, ఈ ఏడాది జూన్లో ఇండస్ట్రీ కన్సల్టేషన్ నిర్వహించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్టు సెబీ తాజాగా విడుదల చేసిన మాస్టర్ సర్క్యూలేషన్లో వెల్లడించింది.
గతంలో విడుదల చేసిన మార్గదర్శకాల ప్రకారం పంపిణీదారులు కనీసం రూ.10 వేలు సబ్స్క్రిప్షన్ మొత్తాన్ని తీసుకువచ్చిన వారికి చార్జీల నుంచి మినహాయింపునిచ్చింది. డిస్ట్రిబ్యూటర్లు, ఏఎంసీ ఏజెంట్ల నుంచి సమాచారం ఆధారంగా సెబీ ఈ నిర్ణయం తీసుకున్నది. దీంతో ఇలాంటి చార్జీలను పూర్తిగా ఎత్తివేస్తున్నట్టు తెలిపింది. ఈ నిర్ణయం వెంటనే అమలులోకి రానున్నట్లు పేర్కొంది.