SBI- Nirmala Sitaraman | ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ) కొత్తగా 500 శాఖలను ప్రారంభిస్తుందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. సోమవారం ముంబై ఎస్బీఐ ప్రధాన కార్యాలయం శత వార్షికోత్సవ సభలో ఆమె మాట్లాడుతూ ఈ సంగతి చెప్పారు. 1921లో మూడు ప్రెసిడెన్సీ బ్యాంకులను విలీనం చేసి (ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఐబీఐ) ఏర్పాటు చేశారు. 1955లో ఐబీఐని ఎస్బీఐగా మారుస్తూ పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం చట్టం చేసింది. 1921లో 250 శాఖలు గల బ్యాంకు ఇప్పుడు 22,500 శాఖలకు పెరిగిందన్నారు. 2025 మార్చి నెలాఖరు నాటికి మరో 500 శాఖలతో మొత్తం ఎస్బీఐకి 23 వేల శాఖలు అవుతాయన్నారు.
భారత్లో ఆర్థిక అసమానతలు ఉన్నాయని ఎగతాళి చేస్తున్న వేళ అత్యధికంగా ఎస్బీఐ.. 23 వేల శాఖలు కలిగి ఉండటం గ్లోబల్ రికార్డు అని నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. దేశంలోని బ్యాంకుల డిపాజిట్లలో ఎస్బీఐ 22.4 శాతం వాటా కలిగి ఉందని, 50 కోట్ల పై చిలుకు కస్టమర్లకు సేవలందిస్తున్నదని, ఐదో వంతు రుణాలు మంజూరు చేస్తున్నదని తెలిపారు. ఎస్బీఐ డిజిటల్ పెట్టుబడులు పటిష్టంగా ఉన్నాయని నిర్మలా సీతారామన్ తెలిపారు. ప్రతి రోజూ బ్యాంకు ద్వారా 20 కోట్ల యూపీఐ లావాదేవీలు జరుగుతాయన్నారు. ముంబైలోని ఎస్బీఐ ప్రధాన కార్యాలయం 1924లో ప్రారంభమైందని గుర్తు చేశారు.