న్యూఢిల్లీ, సెప్టెంబర్ 13: ధరల సూచీ మళ్లీ ఎగబాకడంతో వచ్చే నెల రిజర్వు బ్యాంక్ సమీక్షలో కీలక వడ్డీరేట్లను తగ్గించే అవకాశాలు లేవని ఎస్బీఐ తన రిసర్చ్ నివేదికలో వెల్లడించింది. ఆగస్టు నెలకుగాను రిటైల్ ధరల సూచీ రెండు శాతం పైకి ఎగబాకింది. అక్టోబర్ సమీక్షలో వడ్డీరేట్లను ముట్టుకోకపోవచ్చని, అలాగే డిసెంబర్ సమీక్షలోనూ రేట్లను తగ్గించే అవకాశాలు కనిపించడం లేదని తెలిపింది.
జీఎస్టీ రేట్లను తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఆహారేతర ద్రవ్యోల్బణ సూచీ మరింత దిగిరానున్నదని అభిప్రాయపడింది. పలు రాష్ర్టాల్లో వర్షాలు అధికంగా కురియడంతో గత నెలలో ఆహార పదార్థాల ధరలు భగ్గుమన్నాయని, ముఖ్యంగా కూరగాయలు, కోడిగుడ్లు, మాంసం, చేపల ధరలు భారీగా పెరగడంతో వరుసగా తొమ్మిది నెలలుగా తగ్గుతూ వచ్చిన ధరల సూచీ మళ్లీ ఎగబాకింది. కీలక వస్తువులపై జీఎస్టీని 12 శాతం నుంచి 5 శాతానికి లేదా సున్నాకు తగ్గించింది. ఈ నిర్ణయంతో ద్రవ్యోల్బణ సూచీ 25-30 బేసిస్ పాయింట్లు తగ్గే అవకాశం ఉన్నదని పేర్కొంది.