Interest Rates | న్యూఢిల్లీ, మార్చి 13: రాబోయే ద్రవ్యసమీక్షల్లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కీలక వడ్డీరేట్లను గట్టిగానే కోత పెట్టవచ్చని ఎస్బీఐ రిసెర్చ్ ఎకోరాప్ తమ తాజా నివేదికలో అంచనా వేసింది. ఈ ఏడాది ఏప్రిల్, జూన్, అక్టోబర్ నెలల్లో జరిగే ద్వైమాసిక ద్రవ్యపరపతి విధాన సమీక్షల్లో రెపోరేటును 25 బేసిస్ పాయింట్ల చొప్పున మొత్తం 75 బేసిస్ పాయింట్లు తగ్గించే వీలుందని చెప్తున్నది. గత నెల జరిగిన ద్రవ్యసమీక్షలో దాదాపు ఐదేండ్ల తర్వాత రెపోరేటును ఆర్బీఐ పావు శాతం తగ్గించిన విషయం తెలిసిందే. అంతకుముందు 2020 మే నెలలో చివరిసారిగా తగ్గించారు.
ఇప్పుడు రెపోరేటు 6.25 శాతంగా ఉన్నది. కరోనాతో దిగాలుపడిన దేశ ఆర్థిక వ్యవస్థను ఉత్తేజపర్చేందుకు వడ్డీరేట్లను పెద్ద ఎత్తున తగ్గిస్తూపోయిన ఆర్బీఐ.. ఆ తర్వాత ద్రవ్యోల్బణం అదుపు పేరిట వరుసగా పెంచుతూపోయింది. దీంతో 6.50 శాతానికి చేరింది. అయితే వచ్చే ద్రవ్యసమీక్షల్లో వడ్డీరేట్లు తగ్గుతాయన్న సంకేతాలను అప్పటి ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ఇచ్చారు. అందుకు తగ్గట్టే దాస్ తర్వాత వచ్చిన కొత్త గవర్నర్ సంజయ్ మల్హోత్రా.. ఫిబ్రవరిలో చేపట్టిన తన మొదటి ద్రవ్యసమీక్షలోనే 25 బేసిస్ పాయింట్లు తగ్గించారు. ఈ క్రమంలో వచ్చే ఏప్రిల్, జూన్ ద్రవ్యసమీక్షల్లోనూ వడ్డీరేట్లు 25 బేసిస్ పాయింట్ల చొప్పున తగ్గవచ్చని, ఆగస్టులో విరామం ఇచ్చి అక్టోబర్ సమీక్షలో మళ్లీ 25 బేసిస్ పాయింట్లు తగ్గించవచ్చని ఎస్బీఐ రిసెర్చ్ అంచనా వేస్తున్నది. ఇలా ఈ ఏడాది కనీసం 75 బేసిస్ పాయిైంట్లెనా రెపోరేటు తగ్గుతుందన్న విశ్వాసాన్ని వెలిబుచ్చుతున్నది.
ద్రవ్యోల్బణం అదుపులోకి వస్తుండటం వడ్డీరేట్ల కోతలకు కలిసొస్తున్నదని ఎస్బీఐ రిసెర్చ్ చెప్తున్నది. ఈ జనవరి-మార్చిలో వినియోగదారుల ధరల సూచీ (సీపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం 3.9 శాతానికి తగ్గవచ్చని, మొత్తం ఈ ఆర్థిక సంవత్సరం (2024-25) 4.7 శాతానికి పరిమితం కావచ్చని పేర్కొంటున్నది. వచ్చే ఆర్థిక సంవత్సరం (2025-26) సైతం 4-4.4 శాతం శ్రేణిలోనే ఉండవచ్చంటున్నది. దీంతో ఆర్బీఐ ఆమోదయోగ్య స్థాయిలోనే ద్రవ్యోల్బణం గణాంకాలుండటం వల్ల వడ్డీరేట్ల కోతలను ఇంకా ఆశించవచ్చని అంటున్నది. ఈ ఫిబ్రవరిలో రిటైల్ ద్రవ్యోల్బణం ఏడు నెలల కనిష్ఠాన్ని తాకుతూ 3.6 శాతంగా నమోదైన సంగతి విదితమే. ఆహారోత్పత్తులు, శీతల పానీయాలు, కూరగాయల ధరలు తగ్గడమే ఇందుకు కారణమని కేంద్ర ప్రభుత్వం చెప్తున్నది.
ఆర్బీఐ రెపోరేటును తగ్గించినా.. దానికి అనుగుణంగా బ్యాంకులు తామిచ్చే రుణాలపై వడ్డీరేట్లను తగ్గించకపోతే రుణగ్రహీతలపై భారం అలాగే ఉంటుందని, మార్కెట్లో కొనుగోలు శక్తి పెరగదని నిపుణులు చెప్తున్నారు. ఆర్బీఐ కూడా ఇటీవలికాలంలో ఇదే ఆందోళనను వ్యక్తం చేస్తూ వడ్డీరేట్ల తగ్గింపు ప్రయోజనాన్ని కస్టమర్లకు ఇవ్వాలని తరచూ సూచిస్తున్నదీ చూస్తూనే ఉన్నాం. రుణాలపై వడ్డీరేట్లు తగ్గితే ఈఎంఐల భారం దిగుతుంది. ఇది రియల్టీ, ఆటో, కన్జ్యూమర్ గూడ్స్ తదితర రంగాల్లో సేల్స్‌ను పెంచుతుంది. మొత్తానికి వచ్చే ఆర్బీఐ ద్రవ్యసమీక్షలపై అటు రుణగ్రహీతలు, ఇటు వ్యాపార-పారిశ్రామిక వర్గాలకు, మరోవైపు బ్యాంకులకు పెద్ద ఎత్తునే అంచనాలున్నాయని చెప్పవచ్చు.
దేశీంగా ద్రవ్యోల్బణం అదుపులోకి వచ్చినా ఆర్బీఐకి వడ్డీరేట్ల తగ్గింపునకు మరో అడ్డంకి ట్రంప్ రూపంలో వచ్చిపడుతున్నది. అంతర్జాతీయ వాణిజ్యంలో సుంకాల పోరుకు కాలుదువ్వుతున్న అగ్రరాజ్యాధినేత.. భారత్‌పైనా వచ్చే నెల నుంచి అధిక సుంకాలు పడుతాయని హెచ్చరిస్తున్నది తెలిసిందే. ఇదే జరిగితే అమెరికా నుంచి దిగుమతయ్యే వస్తూత్పత్తుల రేట్లు అమాంతం పెరగడం ఖాయమే.