గురువారం 04 జూన్ 2020
Business - Apr 07, 2020 , 23:26:39

పొదుపులపై ఎస్బీఐ వడ్డీకోత

పొదుపులపై ఎస్బీఐ వడ్డీకోత

-పావు శాతం తగ్గించిన బ్యాంక్‌ 

-ఎంసీఎల్‌ఆర్‌ 35 బేసిస్‌ పాయింట్లు తగ్గింపు

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 7: దేశీయ బ్యాంకింగ్‌ దిగ్గజం స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్బీఐ) డిపాజిట్‌దారులకు షాకిచ్చింది. అన్ని రకాల డిపాజిట్లపై వడ్డీరేటును పావు శాతం తగ్గిస్తున్నట్లు మంగళవారం ప్రకటించింది. దీంతో డిపాజిట్లపై వడ్డీరేటు 3 శాతం నుంచి 2.75 శాతానికి పరిమితమైంది. ఈ నూతన వడ్డీరేట్లు ఈ నెల 15 నుంచి అమలులోకి రానున్నట్లు తెలిపింది. వ్యవస్థలో తగినంత ద్రవ్య లభ్యతను పెంచే ఉద్దేశంలో ఎస్బీఐ పొదుపు ఖాతాలపై చెల్లించే వడ్డీరేట్లలో కోత విధించింది. మరోవైపు మార్జినల్‌ కాస్ట్‌ ఆఫ్‌ ఫండ్స్‌ బేస్డ్‌ లెండింగ్‌ రేటు(ఎంసీఎల్‌ఆర్‌)ని కూడా 35 బేసిస్‌ పాయింట్ల వరకు తగ్గించింది. బ్యాంక్‌ తీసుకున్న తాజా నిర్ణయంతో ఏడాది కాలపరిమితి కలిగిన ఎంసీఎల్‌ఆర్‌పై రేటు 7.75 శాతం నుంచి 7.40 శాతానికి దిగొచ్చాయి. ఈ రేట్లు ఈ నెల 10 నుంచి అమలులోకి రానున్నట్లు బ్యాంక్‌ ఒక ప్రకటనలో వెల్లడించింది. దీంతో 30 ఏండ్ల కాలపరిమితి కలిగిన లక్ష రూపాయల గృహ రుణాలపై చెల్లించనున్న ఈఎంఐ రూ.24 తగ్గనున్నది. గడిచిన ఆర్థిక సంవత్సరంలో ఏకంగా 11 సార్లు వడ్డీరేట్లను తగ్గించిన విషయం తెలిసిందే. 


logo