ముంబై, అక్టోబర్ 25: ఇటీవల దేశంలో సైబర్ నేరాలు, డిజిటల్ మోసాల కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఖాతాదారులను ఎస్బీఐ అప్రమత్తం చేసింది. ఫిషింగ్, ర్యాన్సమ్వేర్ దాడులతో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతుండటంతో ఆన్లైన్ బ్యాంకింగ్ వినియోగదారులు జాగ్రత్తగా ఉండాలని తాజాగా సూచించింది. ఒకవేళ తమ ఖాతాల్లో ఏదైనా అనధికారిక లావాదేవీని గుర్తించినైట్టెతే వెంటనే ఆ సమాచారాన్ని బ్యాంకుకు తెలియపర్చాలన్నది.
ఎస్బీఐ కస్టమర్ సర్వీస్‌కు చెందిన 1800 1234 అనే టోల్-ఫ్రీ నెంబర్‌కు కాల్ చేయాలని తెలిపింది. దీనివల్ల ఖాతాదారులు నష్టపోయిన మొత్తాన్ని స్తంభింపజేసే వీలుంటుందని, అప్పుడు రికవరీ సులువవుతుందని వివరించింది. ఆలస్యమవుతున్నకొద్దీ నష్టతీవ్రత పెరుగుతుందని కూడా చెప్పింది. కాగా, గత నెలలోనూ ఎస్బీఐ చైర్మన్ దినేశ్ కుమార్ ఖారా.. బ్యాంక్ కస్టమర్లకు ఇదే తరహా హెచ్చరికలు చేసిన విషయం తెలిసిందే.
ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఏటీఎం, మొబైల్ బ్యాంకింగ్, భీమ్ ఎస్బీఐ పే సర్వీసెస్‌ల్లో సమస్యలున్నా బ్యాంకుకు ఫిర్యాదు చేయవచ్చని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఫిర్యాదు అందిన వెంటనే సంబంధిత వర్గాలు చర్యలు చేపడతాయన్నారు. 90 రోజుల్లోగా పరిష్కారం లభిస్తుందని స్పష్టం చేశారు. ఇక నమోదైన ఫిర్యాదు, ఇతరత్రా వివరాలను కస్టమర్ ఖాతాకు అనుసంధానమైన మొబైల్ నెంబర్‌కు ఎస్ఎంఎస్ లేదా ఈమెయిల్‌కు పంపించడం జరుగుతుందని ఎస్బీఐ తెలియజేసింది.