SBI Home Loans Costly | దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్.. భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ) వివిధ రుణాలపై కీలక వడ్డీరేట్లు మరోమారు పెంచేసింది. బెంచ్మార్క్ ప్రైమ్ లెండింగ్ రేట్ (బీపీఎల్ఆర్) 70 బేసిక్ పాయింట్లు (0.7 శాతం) పెంచేసింది. దీంతో బీపీఎల్ఆర్ 13.45 శాతానికి పెరిగింది. ఎస్బీఐలో బీపీఎల్ఆర్ లింక్డ్ ఇండ్ల రుణ వాయిదాల చెల్లింపులు కాస్ట్లీ కానున్నాయి. చివరిసారిగా గత జూన్లో సవరించినప్పుడు బీపీఎల్ఆర్ 12.75 శాతంగా ఉండేది. పెంచిన బీపీఎల్ఆర్ గురువారం నుంచి అమల్లోకి వస్తుందని ప్రకటించింది.
దీంతోపాటు ఎస్బీఐ బేస్ వడ్డీరేటు 8.7 శాతానికి పెరిగింది. బేస్రేట్ ఆధారంగా తీసుకున్న రుణ వాయిదాల చెల్లింపులు కూడా భారం కానున్నాయి. అత్యధిక బ్యాంకులు ఎక్స్టర్నల్ బెంచ్మార్క్ బేస్డ్ లెండింగ్ రేట్ (ఈబీఎల్ఆర్) లేదా రెపోరేట్ లింక్డ్ లెండింగ్ రేట్ (ఆర్ఎల్ఎల్ఆర్) ఆధారంగా రుణాలు మంజూరు చేస్తున్నాయి. ఎస్బీఐ సహా అన్ని బ్యాంకులు బీపీఎల్ఆర్, ఈబీఎల్ఆర్, ఆర్ఆర్ఎల్ఆర్ వంటివి మూడు నెలలకోసారి సవరిస్తుంటాయి.
పెరిగిపోయిన ధరలను కట్టడి చేయడానికి గత మే నుంచి మూడుసార్లు ఆర్బీఐ 140 బేసిక్ పాయింట్లు రెపోరేట్ పెంచిన సంగతి తెలిసిందే. గత నెలలో చిల్లర ద్రవ్యోల్బణం ఆర్బీఐ సౌలభ్యస్థాయి కంటే ఎక్కువగా నమోదు కావడంతో మళ్లీ వడ్డీరేట్లు పెంచవచ్చునని భావిస్తున్నారు. ఈ నెల 28 నుంచి 30 మధ్య తదుపరి ఆర్బీఐ ద్రవ్య పరపతి సమీక్ష జరుగనుండటం గమనార్హం.