హైదరాబాద్, ఆగస్టు 28 (నమస్తే తెలంగాణ) : ఏపీలోని పోలవరం డ్యామ్‌లో ఈ ఏడాది నుంచే నీటిని నిల్వ చేసేందుకు ఏపీ సర్కార్ సిద్ధమవుతున్నది. ఇప్పటికే కేంద్రప్రభుత్వం సైతం దానికి ఆమోదం తెలిపింది. ఆ దిశగా ఏపీ సర్కార్ ముమ్మర కసరత్తు చేస్తున్నది. పీపీఏ (పోలవరం ప్రాజెక్టు అథారిటీ) సైతం నీటినిల్వ అంశంపై అన్ని రాష్ర్టాల సమ్మతి కోసం సన్నాహాలు ప్రారంభించింది. అందులో భాగంగా సెప్టెంబర్ 9న పీపీఏ 18వ బోర్డు సమావేశాన్ని నిర్వహించనున్నట్టు విశ్వసనీయ సమాచారం. ఈ సమాచారాన్ని ఇప్పటికే అన్ని రాష్ర్టాలకు అందించినట్టు తెలుస్తున్నది.
కానీ, పోలవరంలో నీటినిల్వ కారణంగా వెనుక జలాలతో తెలంగాణలో భద్రాద్రి సహా పలు గ్రామాలకు ముంపు ప్రమాదం పొంచి ఉన్నది. ఈ ముంపు నుంచి రక్షణ కల్పించేందుకు ఇప్పటివరకు ఎలాంటి చర్యలు చేపట్టక ముందే నీటినిల్వకు సన్నాహాలు ప్రారంభించడం, ఇక్కడి కాంగ్రెస్ సర్కార్ చోద్యం చూస్తుండటం ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పోలవరం ప్రాజెక్టులో నీటినిల్వతో ముంపుతోపాటు, ఇతర అనేక సాంకేతిక అభ్యంతరాలను వ్యక్తంచేస్తూ తెలంగాణ, ఏపీ, ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ర్టాలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. ఈ నేపథ్యంలో అన్ని రాష్ర్టాలతో ఏకాభిప్రాయం సాధించాలని కోర్టు ఇప్పటికే ఆదేశించింది. అందులో భాగంగా గతంలో సీడబ్ల్యూసీ పలుమార్లు అన్ని రాష్ర్టాలతో సమావేశం నిర్వహించింది.
ఈ సందర్భంగా గతంలోనే కేసీఆర్ నేతృత్వంలోని నాటి బీఆర్ఎస్ సర్కార్ సహేతుకమైన అధ్యయనాలు, గణాంకాలతో బలమైన వాదనలు వినిపించింది. ఆ వాదలన్నింటితో కేంద్ర జల్‌శక్తి శాఖ, సీడబ్ల్యూసీ ఏకీభవించింది. పోలవరం బ్యాక్‌వాటర్ కారణంగా ప్రవాహానికి ఎదురుగా అఫ్లక్స్ ఏర్పడిందని అంగీకరించాయి. గోదావరి నదికి ఇరువైపులా ఉన్న అన్ని ప్రధాన ప్రవాహాలను కవర్ చేస్తూ జాయింట్ సర్వే చేయిస్తామని, అందుకు సంబంధించిన వివరాలివ్వాలని తెలంగాణకు 2022లోనే సూచించింది. వెంటనే ఆ మేరకు జాయింట్ సర్వే చేపట్టాలని పీపీఏ, ఏపీ ప్రభుత్వానికి సైతం కేంద్ర జలసంఘం స్పష్టమైన ఆదేశాలను జారీచేసింది. కానీ ఇప్పటికీ ఆ దిశగా ఒక్క అడుగు పడలేదు.

సీడబ్ల్యూసీ మళ్లీ జోక్యం చేసుకొని ఉమ్మడి సర్వే పూర్తికి నియమిత కాలపరిమితిని విధిస్తూ పీపీఏ (పోలవరం ప్రాజెక్టు అథారిటీ)కు అల్టిమేటం జారీచేసింది. తొలుత తెలంగాణ, ఏపీ రాష్ర్టాలతో సమావేశం నిర్వహించాలని, ముంపుపై ఇరు రాష్ర్టాలు గతంలో చేసిన అధ్యయనాలపై, రూపొందించిన మ్యాపులపై చర్చించాలని దిశానిర్దేశం చేసింది. అంతేకాదు ఏపీ సహకరించినా, సహకరించకపోయినా తెలంగాణతో కలిసి ఉమ్మడి సర్వే నిర్వహించాలని, ఆబాధ్యత పీపీఏదేనని తేల్చిచెప్పింది. దీంతో పీపీఏ, ఏపీ ఆ మధ్య కొంత హడావుడి చేశాయి. జాయింట్ సర్వేకు ప్రత్యేకంగా అధికార బృందాన్ని నియమించడంతోపాటు, సర్వే నిర్వహణకు అనుకూలమైన తేదీలు తెలుపాలని తెలంగాణకు సమాచారం అందించాయి. తీరా సర్వే చేసేందుకు వచ్చిన ఏపీ మళ్లీ పేచీ పెట్టింది. తెలంగాణ డిమాండ్ల మేరకు సర్వే చేయడం ఎట్టి పరిస్థితుల్లోనూ కుదరదని, కేవలం పోలవరంప్రాజెక్టు ఎఫ్ఆర్ఎల్ 150 అడుగల మేర కు నీటినిల్వ వల్లగతంలో బూర్గంపాడువరకు తేల్చిన ముంపు వరకే సర్వే చేస్తామంటూ కొర్రీలు పెట్టి సర్వే చేయకుండా నిలుపుదలచేసింది. సీడబ్ల్యూసీ సూచించిన మేరకు సర్వే చేయడం కుదరదని, ఒకవేళ అదేచేస్తే జాతీయ ప్రాజెక్టుపై ప్రభావం పడుతుందని వితండ వాదానికి తెరలేపి సర్వే ప్రక్రియను అటకెక్కించింది. నాటినుంచి గత రెండేండ్లుగా ఆ ప్రక్రియ ‘ఎక్కడవేసిన గొంగలి అక్కడే’అన్నచందంగా మారింది. ఆదిశగా కేంద్రం పై, పీపీఏపై, ఏపీ సర్కార్‌పై ఒత్తిడితేవడంలో కాంగ్రెస్ సర్కార్ విఫలమైంది. లేఖలురాసి చేతులుదులుపుకుపోవడం తప్ప చొరవ చూపకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ప్రస్తుతం పోలవరం డ్యామ్‌లో ఫేజ్-1లో భాగంగా 41.5 మీటర్ల స్థాయిలోనే నీటినిల్వ చేస్తామని కేంద్రం, ఏపీ పదే పదే చెప్తున్నాయి. ఆ స్థాయిలో ముంపేమీ ఉండబోదని నమ్మబలుకుతున్నాయి. కానీ వాస్తవమేందంటే? ఆ స్థాయిలోనూ తెలంగాణలో ముంపు వాటిల్లనున్నదని రాష్ట్ర ఇంజినీర్లు హెచ్చరిస్తున్నారు. గతంలోనే సర్వేచేసి శాస్త్రీయంగా ముంపు లెక్కతేల్చారు. 150 అడుగుల ఎఫ్ఆర్ఎల్ (ఫుల్ రిజర్వాయర్ లెవల్) వద్ద పోలవరంలో నీరు నిలిస్తే భద్రాద్రి-కొత్తగూడెం జిల్లాలో 954 ఎకరాలు నీటమునగడంతోపాటు, భద్రాచలంలో స్థానిక డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోతుందని తేల్చారు. ట్రిబ్యునల్ అవార్డు ప్రకారం 36 లక్షల క్యూసెకుల వరదకు సంబంధించి మాత్రమే పోలవరం ఎగువన ఉన్న ప్రాదేశిక ప్రాంతాల్లో బ్యాక్‌వాటర్ ఎఫెక్ట్ స్టడీని సీడబ్ల్యూసీ చేయించిందని, అప్పుడు డ్యామ్ డిశ్చార్జి స్థాయిని 140 అడుగుల (42.67మీ) నుంచి 135.05 అడుగులు (41.15 మీ)గా నిర్ధారించారని తెలిపారు. కానీ, ప్రస్తుతం ప్రాజెక్టు సామర్థ్యాన్ని 50 లక్షల క్యూసెకులకు డిజైన్ చేశారని, వరద డిశ్చార్జి స్థాయిని అదనంగా 148.5 అడుగులు (45.26 మీ)గా నిర్ధారించారని, తద్వారా అప్ స్ట్ట్రీమ్లో నీరు ఎక్కడికక్కడ నిలిచిపోవడంతోపాటు ముంపు పెరుగనున్నదని వెల్లడించారు. గతంలో కిన్నెరసాని, శబరి, సీలేరు అంగళ్లతో పాటు డిజైన్ వరద, బ్యాక్‌వాటర్ ఎఫెక్ట్ వల్ల ఎంతమేరకు నీటమునిగిందనేది సీడబ్ల్యూసీ పరిగణనలోకి తీసుకోలేదని, అదీగాక దిగువ గోదావరి బేసిన్లో వరుసగా వరదలు సహజమని, ఈ నేపథ్యంలో భద్రాచలం వద్ద వరద మట్టం మరింత పెరుగుతుందని, 2022 జూలై వరదలే అందుకు నిదర్శనమని ఇంజినీర్లు లెక్కలతో నిరూపించారు.
పోలవరంలో నీటినిల్వ చేస్తే ఆ కారణంగా నదికి వరదల సమయంలో పెద్దవాగు, ఈదుళ్లవాగు, పాములేరు వాగు, తురుబాకవాగు సహా 31 ఇతర ప్రధాన, మధ్యస్థ వాగులు స్తంభించిపోతాయి. ఈ ప్రభావం 60 గ్రామాలపై ఉంటుందని, మొత్తంగా 40,446 ఎకరాల విస్తీర్ణం నీట మునగడంతోపాటు, 28,000 మంది నిరాశ్రయులవుతారని, మణుగూరు హెవీ వాటర్‌ప్లాంట్‌కు ముంపు పొంచి ఉంటుందని ఇంజినీర్లు తేల్చిచెప్పారు.
సెప్టెంబర్ 9న ఉదయం 11 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పీపీఏ చైర్మన్ నేతృత్వంలో 18వ బోర్డు సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఈ మేరకు ఏపీ, తెలంగాణ రాష్ర్టాలు, కేంద్ర జల్‌శక్తి శాఖ అధికారులకు పీపీఏ మెంబర్ సెక్రటరీ రఘురామ్ లేఖ రాశారు. ఎజెండాను త్వరలోనే పంపనున్నట్టు పేర్కొన్నారు. కేవలం భూసేకరణ, ముంపు, పునరావాస చర్యలను ఈ భేటీలో చర్చించనున్నారు. ప్రస్తుతం చేపట్టనున్న 41మీటర్ల స్థాయిలో నీటినిల్వ వల్ల ముంపు ఉండబోదని, అందుకు అనుగుణంగా అన్ని రాష్ర్టాలను ఒప్పించేందుకే బోర్డు సమావేశం ఏర్పాటు చేస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం.
‘1986లో గోదావరిలో 27 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం వచ్చింది. అప్పడు నది 75.6 అడుగుల మేర మాత్రమే ప్రవహించింది. కానీ, 2022 జూలైలో కేవలం 24.22 లక్షల క్యూసెక్కుల వరదకే గోదావరి 71.3 మీటర్ల మేర ప్రవహించింది. గతంలో కంటే తక్కువగా వరద వచ్చినా తీవ్ర విధ్వంసాన్ని సృష్టించింది. అందుకు ప్రధాన కారణం పోలవరం ప్రాజెక్టు స్పిల్ వే, కాఫర్ డ్యామ్ వద్ద +127.2 అడుగుల (+38.76మీ) నీటి నిల్వ ఉండటమే. ఆ ఫలితంగా ఎగువ నుంచి వచ్చిన వరద గోదావరిలో కలువలేకపోవడం వల్లే ముంపు మరింత పెరిగింది’ అని తెలంగాణ ఇంజినీర్లు శాస్త్రీయ అధ్యయనాలతో తేల్చి చెప్పారు. పోలవరం ప్రాజెక్టులో ఏడాదికి 0.4 మి.మీ. కంటే ఎకువగా పూడిక పేరుకుపోతుందని, అదనపు సిల్ట్ భద్రాచలం దాటి విస్తరిస్తున్నదని, స్టోరేజీలు లేనప్పుడే బ్యాక్‌వాటర్ లెవెల్స్ పెరిగే ప్రమాదం ఉన్నదని తేల్చి చెప్పారు. కాలానుగుణంగా ధ్రువీకరించిన నది క్రాస్-సెక్షన్, వార్షిక గరిష్ఠ వరద ప్రవాహాల వివరాలు, గణాంకాలపై సర్వేచేసి ఎలాంటి ప్రభావం ఉండబోదని నిర్ధారించుకున్న తర్వాతే పోలవరంలో నీటినిల్వ చేపట్టాలని ఇంజినీర్లు నొక్కిచెప్పారు. అంతేకాదు ముంపు నివారణకు అన్ని రక్షణ చర్యలు చేపట్టాల్సి ఉంటుందని నిర్ధారించారు.