ఎన్నికల మ్యానిఫెస్టోలో ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమస్యలను ఆరు నెలల్లో పరిష్కరిస్తామని ఇచ్చిన హామీని విశ్వసించి, కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి కృషి చేశారనేది బహిరంగ రహస్యం. కానీ ప్రభుత్వం ఏర్పడి 32 నెలలు గడిచినా ఉద్యోగులకు ఇచ్చిన ప్రధాన హామీల్లో ఒక్కటి కూడా పూర్తిస్థాయిలో పరిష్కారం కాలేదన్న భావన ఉద్యోగుల్లో బలంగా నాటుకుపోయింది.ఉద్యోగ సంఘాల జేఏసీలు అనేక సందర్భాల్లో ముఖ్యమంత్రి మొదలుకొని మంత్రుల వరకు తమ సమస్యలను తీసుకెళ్లి పరిష్కరించాలని విజ్ఞప్తి చేశాయి. ప్రభుత్వం ఇచ్చిన హామీలను విశ్వసించి గతంలో ప్రకటించిన ఆందోళన కార్యక్రమాలను సైతం విరమించుకొని ఉద్యోగులు దాదాపు రెండేండ్లు ఓపికగా ఎదురుచూశారు. కానీ సమస్యలు పరిష్కారం కాకపోవడంతో ఇప్పుడు తీవ్ర అసంతృప్తి నెలకొని ఆందోళన వ్యక్తమవుతున్నది.
క్షేత్రస్థాయిలో ఉద్యోగుల నుంచి వస్తున్న ఒత్తిడితో ఉద్యోగ సంఘాల జేఏసీలు కూడా ఉద్యమ కార్యాచరణ ప్రకటించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈనెల 27న రాష్ట్రవ్యాప్తంగా జిల్లా కేంద్రాల్లో నిర్వహించిన నిరసన కార్యక్రమాలకు పెద్ద సంఖ్యలో ఉద్యోగులు హాజరుకావడం, సెప్టెంబర్ 10న చలో హైదరాబాద్‌కు పిలుపునివ్వడం ప్రభుత్వం పట్ల ఉద్యోగుల్లో పెరుగుతున్న అసంతృప్తికి నిదర్శనం. ఇది కేవలం ఉద్యోగ సంఘాల ఉద్యమం కాదు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలనే అమలు చేయాలని కోరుతున్నారు. ఉద్యోగుల ప్రధాన డిమాండ్లలో మొదటిది పీఆర్సీ అమలు. జూలై 1, 2023 నుంచి మూడో పీఆర్సీ అమలు కావాల్సి ఉన్నది. బీఆర్ఎస్ సర్కార్ పీఆర్సీ కమిటీని ఏర్పాటు చేసి 5 శాతం మధ్యంతర భృతి ప్రకటించింది. కమిటీ ఏర్పాటై దాదాపు మూడేండ్లు గడుస్తున్నా నివేదిక ఎప్పుడు వస్తుందో, పీఆర్సీ ఎప్పుడు అమలు చేస్తారో ఉద్యోగులకు స్పష్టత లేదు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండు పీఆర్సీలను అమలు చేసి ఉద్యోగుల వేతనాలను గణనీయంగా పెంచిన పరిస్థితి ఉన్నది. ఇప్పుడు మూడో పీఆర్సీ అమలు ఆలస్యం అవుతుండగా మరోవైపు నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. పెరిగిన జీవన వ్యయానికి అనుగుణంగా మెరుగైన ఫిట్మెంట్తో పీఆర్సీ అమలు చేయాలని ఉద్యోగులు కోరుతున్నారు.
మూడేండ్లుగా పెండింగ్‌లో ఉన్న పీఆర్సీపై ప్రభుత్వం ఇకనైనా కాలపరిమితితో కూడిన నిర్ణయం ప్రకటించాలి.ఉద్యోగుల మరో ప్రధాన డిమాండ్ సీపీఎస్ రద్దు. దీనిని రద్దు చేస్తామని ఉద్యోగులకు ఇచ్చిన హామీపై ఇప్పటివరకు స్పష్టమైన నిర్ణయం వెలువడలేదు. కనీసం ఈ అంశాన్ని పరిశీలించేందుకు కమిటీ ఏర్పాటు చేయకపోవడం ఉద్యోగుల్లో నిరాశకు కారణమవుతున్నది. సీపీఎస్ పరిధిలో ఉన్న ఉద్యోగుల సంఖ్య గణనీయంగా ఉన్నది. తమ భవిష్యత్ ఆర్థిక భద్రతపై ఆందోళన చెందుతున్న ఉద్యోగులు సీపీఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని కోరుతున్నారు.
సీపీఎస్ రద్దు కోసం రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగులు ఇటీవల నిరసనలు చేపట్టారు. హైదరాబాద్‌లో సభ నిర్వహించేందుకు అనుమతి విషయంలో కూడా ఉద్యోగ సంఘాలు న్యాయస్థానాన్ని ఆశ్రయించాల్సి వచ్చిన పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి పరిణామాలు సమస్య పరిష్కారానికి బదులు ఉద్యోగుల్లో మరింత అసంతృప్తిని పెంచుతాయి.
జూలై 2023 నుంచి జూలై 2026 వరకు పెండింగ్‌లో ఉన్న డీఏలను వెంటనే చెల్లించాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. ఉద్యోగ సంఘాల లెక్కల ప్రకారం పెండింగ్ డీఏల కారణంగా ఒక్కో ఉద్యోగి ప్రతినెలా సుమారు రూ.10 వేల నుంచి రూ.20 వేల వరకు ఆర్థికంగా నష్టపోతున్న పరిస్థితి ఉన్నదని చెప్తున్నారు. జీతం నుంచి కోతలు విధించడంలో ప్రభుత్వం చూపుతున్న వేగం, ఉద్యోగులకు రావాల్సిన డీఏలు, పీఆర్సీ వంటి ఆర్థిక ప్రయోజనాల చెల్లింపులో ఎందుకు కనిపించడం లేదన్న ప్రశ్న ఉద్యోగుల్లో ఉత్పన్నమవుతున్నది. ఉద్యోగి జీతం నుంచి కోత విధించడం ప్రభుత్వ హక్కు అయితే, అతనికి రావాల్సిన డీఏ చెల్లించడం ప్రభుత్వ బాధ్యత. ఉద్యోగ విరమణ చేసిన ఉద్యోగుల కన్నీళ్లు ఎవరు తుడుస్తారు?
ఉద్యోగ విరమణ చేసిన ఉద్యోగుల పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారిందని ఉద్యోగ సంఘాలు చెప్తున్నాయి. 2024 మార్చి నుంచి 2026 జూలై వరకు ఉద్యోగ విరమణ చేసిన సుమారు 27,842 మంది ఉద్యోగులకు పెన్షన్ సంబంధిత బకాయిలు, గ్రాట్యుటీ, జీపీఎఫ్, ఎన్‌క్యాష్‌మెంట్ తదితర ప్రయోజనాలు పూర్తిగా అందక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పదవీ విరమణ అనంతరం రావాల్సిన డబ్బుల కోసం ఏండ్ల తరబడి ఎదురుచూడాల్సిన పరిస్థితి రావడం అత్యంత బాధాకరం.
కొందరు న్యాయస్థానాలను ఆశ్రయించిన తర్వాతే తమకు రావాల్సిన ప్రయోజనాలు పొందుతున్నారని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగ సంఘాలు చెప్తున్న లెక్కల ప్రకారం సుమారు రూ.15 వేల కోట్ల బకాయిలను ఒకేసారి చెల్లించాలని డిమాండ్ చేస్తున్నప్పటికీ, గత మూడేండ్లలో సుమారు రూ.6 వేల కోట్ల మేర మాత్రమే చెల్లింపులు జరిగాయి. ఇది కేవలం ఆర్థిక సమస్య కాదు. పదవీ విరమణ చేసిన ఉద్యోగుల జీవిత భద్రతకు సంబంధించిన విషయం. జీవితాంతం ప్రభుత్వానికి సేవ చేసిన తర్వాత తమకు రావాల్సిన డబ్బుల కోసం పోరాడాల్సి రావడం కాంగ్రెస్ అసమర్థ పాలనకు నిదర్శనం.
ఉద్యోగులకు హెల్త్ కార్డులు, నగదు రహిత వైద్య సేవలు అందిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. కానీ చాలాకాలం తర్వాత ఉద్యోగుల జీతాల నుంచి 1.5 శాతం ఆరోగ్య పథకం పేరుతో కోత ప్రారంభించినప్పటికీ, అనేక సందర్భాల్లో నగదు రహిత వైద్య సేవలు అందుబాటులో లేకపోవడం వారిలో తీవ్ర ఆందోళన కలిగిస్తున్నది. ఆసుపత్రుల యాజమాన్యాలతో సమగ్రంగా చర్చించి, స్పష్టమైన విధివిధానాలు రూపొందించి, ఉద్యోగులకు నిరంతరాయంగా వైద్య సేవలు అందేలా చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉన్నది. ఈనెల 27న రాష్ట్రంలోని జిల్లా కేంద్రాల్లో నిర్వహించిన నిరసన కార్యక్రమాలకు ఉద్యోగులు పెద్ద సంఖ్యలో తరలిరావడం గమనించాల్సిన విషయం. జేఏసీ నాయకత్వం అంచనాలకు మించి ఉద్యోగులు పాల్గొనడం ద్వారా క్షేత్రస్థాయిలో ఉన్న అసంతృప్తిని స్పష్టంగా వ్యక్తం చేశారు.
ఇప్పటికైనా ప్రభుత్వం ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపి సమస్యల పరిష్కారానికి స్పష్టమైన కాలపట్టికను ప్రకటించాలి. లేకపోతే సెప్టెంబర్ 10న చలో హైదరాబాద్ ఉద్యమం మరింత ఉధృతమయ్యే అవకాశం ఉన్నది.
ఉద్యోగులు, ఉపాధ్యాయులు చేస్తున్న పోరాటానికి బీఆర్ఎస్ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. మాజీ మంత్రి హరీశ్‌రావుతో పాటు పలువురు పార్టీ నాయకులు ఉద్యోగుల ఆందోళనల్లో పాల్గొని సంఘీభావం తెలిపారు. ప్రభుత్వం సమస్యను పరిష్కరించడానికి చర్చల మార్గాన్ని ఎంచుకోవాలి కానీ ఉద్యమాన్ని అణచివేయడానికి ప్రయత్నించడం వల్ల సమస్య మరింత తీవ్రమవుతుంది. ఎన్నికల సమయంలో అన్ని వర్గాలకు ఇచ్చిన హామీలను 100 రోజుల్లో అమలు చేస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. కానీ ప్రభుత్వం ఏర్పడి దాదాపు మూడేండ్లు పూర్తవుతున్నా అనేక హామీలు ఇంకా అమలుకు నోచుకోలేదన్న విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. ఉద్యోగుల సమస్యలు కూడా ఈ విస్తృతమైన హామీల వైఫల్యంలో భాగంగానే మారాయి. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ సెప్టెంబర్ 2 నుంచి 8 వరకు ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించింది. అందులో భాగంగా సెప్టెంబర్ 8న రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగుల ఆందోళనలకు సంఘీభావం ప్రకటించనున్నది. ఉద్యోగుల సమస్యలతో పాటు 22-A భూములు, హైడ్రా, జీవో 97 వంటి అంశాలపై కూడా ప్రజల్లో ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం ప్రజల్లో నెలకొన్న అనుమానాలు, భయాందోళనలను తొలగించేలా స్పష్టమైన విధానాలను ప్రకటించాలి. ప్రజల సమస్యల్లో, వారి పోరాటాల్లో ప్రతిపక్ష పార్టీలు మమేకం కావడం ప్రజాస్వామ్యంలో సహజం. ప్రజా సమస్యలను ప్రశ్నిస్తున్న ప్రతిపక్ష నాయకులను హౌస్ అరెస్టులు చేయడం, నిర్బంధించడం ద్వారా ప్రజల సమస్యలు పరిష్కారం కావు.
ప్రభుత్వం ఏర్పడి దాదాపు మూడేండ్లు పూర్తవుతున్న తరుణంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, రైతులు, నిరుద్యోగులు, ఇతర వర్గాల సమస్యలు పరిష్కారం కోసం ఎదురు చూస్తున్నాయనే భావన పెరుగుతున్నది. ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కొని ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపి పీఆర్సీ, డీఏలు, సీపీఎస్, పెన్షన్ బకాయిలు, హెల్త్ కార్డులు తదితర అంశాలపై స్పష్టమైన నిర్ణయాలు తీసుకోవాలి. ఉద్యోగులు ప్రభుత్వ యంత్రాంగంలో కీలక భాగం. వారి అసంతృప్తిని నిర్లక్ష్యం చేస్తే దాని ప్రభావం పరిపాలనపై పడటం సహజం. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ఉద్యోగులు పోషించిన పాత్రను తెలంగాణ సమాజం మరచిపోలేదు. ఉద్యోగుల ఆగ్రహాన్ని ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తే అది కేవలం ఉద్యోగుల ఉద్యమంగా మిగలదు. అది ప్రజా ఉద్యమంగా మారే అవకాశం ఉన్నది. కేసీఆర్ హయాంలో అన్ని వర్గాల అభివృద్ధి, సంక్షేమం కోసం కృషి చేసి రాష్ర్టాన్ని ప్రగతిపథంలో నడిపించారు. బీఆర్ఎస్ తొమ్మిదిన్నరేండ్ల పాలనలోని వికాసాన్ని విధ్వంసం చేయడానికి కాంగ్రెస్ చేస్తున్న ప్రయత్నాలను తెలంగాణ సమాజం ఏకోన్ముఖంగా తిప్పికొట్టడం కోసం మరో పోరాటానికి సిద్ధం కావాలి.
(వ్యాసకర్త: మాజీ చైర్మన్, తెలంగాణ స్టేట్ బేవరేజెస్ కార్పొరేషన్)
-దేవీప్రసాద్