SBI Q4 results : ప్రభుత్వరంగ బ్యాంకింగ్ దిగ్గజమైన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) త్రైమాసిక ఫలితాల (Quarter results) ను ప్రకటించింది. మార్చితో ముగిసిన గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికం (Fourth quarter) లో స్టాండలోన్ ప్రాతిపదికన ఎస్బీఐ రూ.18,642.59 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. అంతకుముందు ఆర్థిక ఏడాది ఇదే త్రైమాసికంతో పోలిస్తే ఎస్బీఐ నికర లాభంలో 10 శాతం క్షీణత కనిపిస్తోంది. 2023-24 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో ఎస్బీఐ రూ.20,698 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది.
సమీక్షా త్రైమాసికంలో ఎస్బీఐ బ్యాంక్ రూ.1,43,876 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. అంతకుముందు ఏడాది ఈ మొత్తం రూ.1,28,412 కోట్లుగా ఉన్నట్లు ఎస్బీఐ తన రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొన్నది. జనవరి – మార్చి మధ్య వడ్డీ రూపంలో రూ.1,19,666 కోట్లు ఆర్జించినట్లు బ్యాంక్ తెలిపింది. త్రైమాసిక ఫలితాల సందర్భంగా బ్యాంకు ఒక్కో షేరుకు రూ.15.90 చొప్పున డివిడెండ్ ప్రకటించింది.
సమీక్షా త్రైమాసికంలో బ్యాంక్ అసెట్ క్వాలిటీ మెరుగైంది. స్థూల నిరర్థక ఆస్తులు 2.24 శాతం నుంచి 1.82 శాతానికి తగ్గాయి. నికర నిరర్థక ఆస్తులు 0.57 శాతం నుంచి 0.47 శాతానికి తగ్గుముఖం పట్టాయి. ఏకీకృత ప్రాతిపదికన ఎస్బీఐ నికర లాభం 8 శాతం క్షీణించింది. గతేడాది జనవరి-మార్చి త్రైమాసికంలో రూ.21,384 కోట్లు కాగా.. ఈ సారి ఆ మొత్తం రూ.19,600 కోట్లుగా నమోదైంది. మొత్తం ఆదాయం రూ.1.64 లక్షల కోట్ల నుంచి రూ.1.79 లక్షల కోట్లకు పెరిగింది.
ఇక పూర్తి ఆర్థిక సంవత్సరానికిగానూ స్టాండలోన్ ప్రాతిపదికన బ్యాంకు లాభం రూ.70,901 కోట్లుగా నమోదైంది. అంతకుముందు ఏడాది రూ.61,077 కోట్లతో పోలిస్తే 16 శాతం వృద్ధి కనబర్చింది.