SBI Jobs | ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కొత్తగా సుమారు 10 వేల మంది ఉద్యోగులను నియమించుకుంటామని భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ) తెలిపింది. సాధారణ బ్యాంకింగ్ అవసరాలు తీర్చడంతోపాటు సాంకేతికంగా మరింత బలోపేతం కావడానికి ఈ నియామకాలు చేపడతామని ఎస్బీఐ చైర్మన్ చల్లా శ్రీనివాసులు శెట్టి పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. వచ్చే మార్చిలోపు కొత్తగా 600 శాఖలను ప్రారంభించడానికి ప్రయత్నిస్తున్నామని అన్నారు. సాధారణ బ్యాంకింగ్ సేవలతోపాటు తమ సిబ్బందిని సాంకేతికంగా బలోపేతం చేసుకోవడానికి యత్నిస్తున్నట్లు తెలిపారు.
1500 మంది సాంకేతిక నిపుణుల నియామకాలు ఇటీవలే చేపట్టామని సీఎస్ శెట్టి అన్నారు. ఎంట్రీ లెవల్ నుంచి ఉన్నత స్థాయి వరకూ డేటా సైంటిస్టులు, డేటా ఆర్కి టెక్ట్లు, నెట్ వర్క్ ఆపరేటర్లు తదితర విభాగాల్లో వారి సేవలను వినియోగించుకుంటున్నామని తెలిపారు. ప్రస్తుతం తమకు 8,000 నుంచి 10 వేల మంది ఉద్యోగులు అవసరం అన్నారు. గత మార్చి నెలాఖరు నాటికి ఎస్బీఐలో 2,32,296 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. అనునిత్యం కస్టమర్ల అవసరాలకనుగుణంగా సిబ్బంది సాంకేతిక నైపుణ్యం మెరుగు పర్చుకునే ప్రక్రియ కొనసాగుతుందని శ్రీనివాసులు శెట్టి తెలిపారు.