SBI | ముంబై, జూలై 15: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) తమ రుణగ్రహీతలకు షాకిచ్చింది. ఆయా కాలవ్యవధులతో కూడిన రుణాలపై వడ్డీరేట్లను పెంచుతున్నట్టు సోమవారం ప్రకటించింది. ఈ క్రమంలోనే మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్-బేస్డ్ లెండింగ్ రేటు (ఎంసీఎల్ఆర్)ను 10 బేసిస్ పాయింట్లదాకా పెంచింది. ఎంసీఎల్ఆర్ అంటే.. కనీస రుణ రేటు. దీనికంటే తక్కువ వడ్డీరేటుకు బ్యాంకులు రుణాలివ్వరాదు. ఎస్బీఐ అధికారిక వెబ్సైట్ ప్రకారం పెరిగిన వడ్డీరేట్లు వెంటనే అమల్లోకి వస్తాయి.
ఈఎంఐల భారం
ఎస్బీఐ తీసుకున్న తాజా నిర్ణయంతో ముఖ్యంగా వాహన, గృహ రుణాలు ప్రియమైపోయాయి. ఇప్పటికే ఆటో, హోమ్ లోన్లపై వడ్డీరేట్లు మోయలేనంతగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో వీటి ఈఎంఐలు మరింత పెరిగాయి. కరోనా మహమ్మారి ప్రభావంతో బలహీనపడ్డ దేశ ఆర్థిక వ్యవస్థను బలపర్చేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) 2020లో వడ్డీరేట్లను గణనీయంగా తగ్గించిన విషయం తెలిసిందే. దీంతో అంతా రుణాలు తీసుకున్నారు.
అయితే కరోనా పరిస్థితులు అదుపులోకి రావ డం, మరోవైపు ద్రవ్యోల్బణం విజృంభించడంతో ధరలను కట్టడి చేయడానికి సెంట్రల్ బ్యాంక్ వడ్డీరేట్లను పెంచుకుంటూపోయింది. వరుస ద్రవ్యసమీక్షల్లో వడ్డనల వల్ల రెపో రేటు గరిష్ఠంగా 6.50 శాతానికి చేరింది. నిరుడు ఫిబ్రవరిలో ఆఖరిసారిగా పెంచగా.. అప్పట్నుంచి రెపో అక్కడే ఉంటున్నది. దీంతో బ్యాంకులూ, ఇతరత్రా బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలూ తమ రుణాలపై వడ్డీరేట్లను ఆ మేరకు పెంచేశాయి.
ఫలితంగా వడ్డీరేట్లు తక్కువగా ఉన్నాయని రుణాలు తీసుకున్నవారిపై ఇప్పుడు నెలవారీ వాయిదాల భారం మోయలేని విధంగా తయారైంది. ఇది ఎస్బీఐ రుణగ్రహీతలపై ఇంకా పెరిగిందిప్పుడు. నిజానికి గత నెల జూన్‌లోనూ ఎంసీఎల్ఆర్ను ఎస్బీఐ 10 బేసిస్ పాయింట్ల వరకు పెంచింది. దీంతో అన్ని కన్జ్యూమర్ లోన్లు ఖరీదెక్కాయి.
మారని ఈబీఎల్ఆర్
ఎస్బీఐ ఎక్స్టర్నల్ బెంచ్‌మార్క్ లెండింగ్ రేటు (ఈబీఎల్ఆర్) 9.15 శాతం+సీఆర్పీ, బీఎస్పీగానే ఉన్నది. అన్ని గృహ రుణాలకు ఈ రేటే లింకై ఉంటుంది. సిబిల్ స్కోర్ ఆధారంగా ఖాతాదారులు తీసుకున్న రుణాలపై వడ్డీరేట్లు 8.50 శాతం నుంచి 9.65 శాతం మధ్య ఉంటాయి. ప్రాసెసింగ్ ఫీజు తీసుకున్న రుణంలో 0.35 శాతానికి సమానంగా ఉంటుంది. దీనికి వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) అదనం. అయినప్పటికీ మొత్తంగా కనీస ఫీజు రూ.2,000, గరిష్ఠం రూ.10,000గానే ఉంటుంది. ఇక గత ఏడాది జూన్ 15 నుంచి ఎస్బీఐ బేస్ రేటు 10.40 శాతంగానే ఉంటున్నది. అలాగే ఈ ఏడాది జూన్ 15 నుంచి బ్యాంక్ వార్షిక బెంచ్‌మార్క్ ప్రైమ్ లెండింగ్ రేటు (బీపీఎల్ఆర్) 15.15 శాతంగా మారిన విషయం తెలిసిందే.
