న్యూఢిల్లీ, జూన్ 14: బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్ బేస్డ్ లెండింగ్ రేటు(ఎంసీఎల్ఆర్)ని 20 బేసిస్ పాయింట్ల వరకు పెంచింది. బుధవారం నుంచి అమలులోకి రానున్నాయి. ఏడాది కాలపరిమితి ఎంసీఎల్ఆర్ 7.20 శాతం నుంచి 7.40 శాతానికి సవరించింది. దీంతో వాహన, గృహ, వ్యక్తిగత రుణాలపై వడ్డీరేటు మరింత అధికమవనున్నది. అలాగే ఒక్కరోజు-మూడేండ్లలోపు రుణాలపై ఎంసీఎల్ఆర్ను 7.05 శాతం నుంచి 7.70 శాతం మేర పెంచింది. రెపో రేటుతో అనుసంధానమైన రుణాలపై వడ్డీరేటుని కూడా సవరించింది. 6.65 శాతం నుంచి 7.15 శాతానికి పెంచింది.
ఎఫ్డీపై కూడా..
ఫిక్స్డ్ డిపాజిట్దారులకు బ్యాంకు శుభవార్తను అందించింది. రూ.2 కోట్ల లోపు ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీరేటును 15-20 బేసిస్ పాయింట్ల వరకు పెంచుతున్నట్లు ప్రకటించింది.
పీఎన్బీ కూడా..
పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్బీ) కూడా ఏడాది నుంచి పదేండ్ల లోపు కాలపరిమితి కలిగిన రూ.2 కోట్ల లోపు ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీరేటును పెంచింది. 1-2 ఏండ్లలోపు ఎఫ్డీలపై వడ్డీరేటును 5.20 శాతానికి పెంచిన బ్యాంక్..2-3 ఏండ్లలోపు 5.30 శాతానికి, మూడేండ్ల నుంచి ఐదేండ్లలోపు ఎఫ్డీలపై ఇంట్రెస్ట్రేటును 5.50 శాతానికి పెంచింది. 5-10 ఏండ్లలోపు ఎఫ్డీలపై ఇంట్రెస్ట్రేటును 5.60 శాతానికి సవరించింది. ఈ నూతన వడ్డీరేట్లు మంగళవారం నుంచి అమలులోకి వచ్చాయని బ్యాంక్ పేర్కొంది. సీనియర్ సిటిజన్లకు అధిక వడ్డీని చెల్లించనున్నది.