న్యూఢిల్లీ, మే 15: దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) డిపాజిట్ దారులకు శుభవార్తను అందించింది. ఎంపిక చేసిన డిపాజిట్లపై వడ్డీరేట్లను 75 బేసిస్ పాయింట్ల వరకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నది. రూ.2 కోట్ల లోపు రిటైల్, బల్క్ డిపాజిట్లపై ఈ పెంపు వర్తించనున్నదని తెలిపింది. పెరిగిన వడ్డీరేట్లు బుధవారం నుంచి అమలులోకి వచ్చాయని పేర్కొంది.
స్వల్పకాలంలో డిపాజిట్లు చేసేవారికి ఊరటను కల్పించే ఉద్దేశంలో భాగంగా బ్యాంక్ 46 రోజుల నుంచి 179 రోజుల లోపు డిపాజిట్లపై వడ్డీని 75 బేసిస్ పాయింట్లు పెంచింది. దీంతో డిపాజిట్లపై వడ్డీరేటు 4.75 శాతం నుంచి 5.5 శాతానికి చేరుకున్నది. అలాగే 180 రోజుల నుంచి 210 రోజుల డిపాజిట్లపై వడ్డీరేటును పావు శాతం సవరించడంతో రేటు 5.75 శాతం నుంచి 6 శాతానికి చేరుకోగా, అలాగే 211 రోజుల నుంచి ఏడాది లోపు టర్మ్ డిపాజిట్లపై వడ్డీరేట్లును పావు శాతం పెంచడంతో 6 శాతం నుంచి 6.25 శాతానికి చేరుకున్నది. సీనియర్ సిటిజన్లకు కూడా ఇంతే స్థాయిలో వడ్డీరేట్లను సవరించింది బ్యాంక్.